రేణిగుంట (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం దొంగలు చెలరేగిపోయారు. అడ్డమొచ్చిన అటవీ సిబ్బంది, పోలీసులపై రాళ్ల వర్షం కురిపించి పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తరువాత (సోమవారం ఉదయం)2 గంటల సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన 220 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది వారిపై దాడి చేశారు.
పోలీసుల సహాయంతో అటవీ సిబ్బంది దాడి చేయడంతో కూలీలు వీరిపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది 180 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.