కారును ఢీకొన్న లారీ.. కారు ట్యాంకర్ పేలి మంటలు | car crushed to lorry...Car fires tanker blast | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ.. కారు ట్యాంకర్ పేలి మంటలు

Published Thu, Nov 28 2013 3:12 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

car crushed to lorry...Car fires tanker blast

వివాహమైన మూడు నెలలకే..
 కంబదూరు మండలంలోని అచ్చంపల్లికి చెందిన హనుమంతరాయడు, లీలావతి దంపతులకు ముగ్గురు కుమారులు. కాగా పెద్ద కుమారుడు శ్రావణకుమార్‌కు మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైంది. పది రోజుల క్రితం శ్రావణ కుమార్ సోదరుడికి కూడా వివాహమైంది. దాదాపు రెండు లక్షల రూపాయలు అప్పు చేసి శ్రావణ కుమార్ పేరూరులో వెల్డింగ్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే భర్త మృతి చెందడంతో మౌనిక భవిష్యత్తు అంధకారమైంది. ‘దేవుడా.. ఎందుకిలా చేశావ్.. ఇక నాకెవరు దిక్కు..’ అంటూ అచ్చంపల్లిలో ఇంటి వద్ద గుండెలవిసేలా ఏడుస్తున్న మౌనికను ఆపడం ఎవరితరం కాలేదు.
 
 సాక్షి, బళ్లారి : లారీ ఢీకొని ఇండికా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన బళ్లారి తాలూకా జోళదరాశి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చోటు చేసుకుంది. మృతులను అనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన ఉప్పర శ్రావణకుమార్(30), ఇదే జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన మందా ఓబుళపతి(28)గా గుర్తించారు. ప్రమాదంలో కారు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగడంతో మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

  పోలీసుల కథనం మేరకు.. శ్రావణకుమార్ అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామంలో వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ స్వగ్రామమైన అచ్చంపల్లికు వచ్చి వెళ్లేవాడు. మంగళవారం రాత్రి పేరూరులో స్నేహితులతో కలిసి మొహర్రం వేడుకలు ముగించుకొని ఆత్మకూరుకు వెళ్లాడు. వెల్డింగ్ మెటీరియల్ కోసం ఆత్మకూరుకు చెందిన ఫొటో గ్రాఫర్ మందా ఓబుళపతితో కలిసి స్నేహితుడు బసవరాజుకు చెందిన ఇండికా కారు (ఏపీ-02 పీ-0924 )లో బళ్లారికి బయల్దేరారు. మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే బళ్లారికి చేరుకునే తరుణంలో జోళదరాసి వద్ద ఎదురుగా బళ్లారి నుంచి అనంతపురం వైపు లోడ్‌తో వస్తున్న లారీ (ఏపీ-03 యూ-6199) ఢీకొంది.
 
 ఈ ప్రమాదంలో కారు డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగడంతో అందులో ఉన్న శ్రావణకుమార్, మందా ఓబుళపతి ఇద్దరూ సజీవ దహనమయ్యారు. హగరి ఎస్‌ఐ సందీప్, అనంతపురం జిల్లా విడపనకల్లు ఎస్‌ఐ లింగన్న  ఘటన స్థలానికి చేరుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఓనర్ వివరాలు కనుక్కుని.. మృతులను అనంతపురం జిల్లా వాసులుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు మందా ఓబుళపతి భార్య చిట్టెమ్మ(చిట్టి), తన ఏడాదిన్నర కుమారుడు, కుటుంబ సభ్యులు, శ్రావణ కుమార్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఏ మృతదేహం ఎవరిది అని గుర్తించలేక మృతుల బంధువులు అయోమయంలో పడ్డారు.
 
 అనంతరం మృతదేహాలను బళ్లారి విమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి నివేదిక అందిన తర్వాత మృతదేహం ఎవరిదనేది తెలుస్తుందని వైద్యులు తెలిపారు. కాగా, ఓబుళపతికి మాత్రమే డ్రైవింగ్ వచ్చు. ఈ లెక్కన డ్రైవింగ్ సీట్లో ఉన్న మృతదేహాన్ని ఓబుళపతిదిగా భావించవచ్చు. అయితే ఆ సమయంలో శ్రావణ్‌కుమార్‌ను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్పుతున్నాడా.. అనే సందేహం తలెత్తడంతో పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల వైపే మొగ్గు చూపారు.
 
 లారీ డ్రైవర్ అరెస్ట్..
 ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ మనోహర్ వాహనాన్ని వేగంగా నడుపుకుంటూ అనంతపురం వైపు వెళ్లాడు. హగరి ఎస్‌ఐ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన విడపనకల్లు పోలీసులు బళ్లారి నుంచి వస్తున్న లారీని ఆపి విచారించారు. అదే సమయంలో డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటాడి పట్టుకొని అరెస్టు చేసి హగరి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
 మృతుల వివరాల కోసం పడిగాపులు
 ప్రమాద స్థలికి పోలీసులు మంగళవారం అర్ధరాత్రే చేరుకున్నా ఏమీ చేయలేని స్థితి నెలకొంది. గుర్తు పట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు.. మరో వైపు చలి.. అయినప్పటికీ పోలీసులు ఘటనా స్థలం వద్దే తిష్టవేసి వివరాల కోసం ఆరా తీశారు. మృతుల గుర్తింపు కోసం చిన్నపాటి ఆధారం కూడా లేక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు అరకొరగా కనిపించిన కారు నంబర్ ఆధారంగా ఓనర్‌ను సంప్రదించి.. బుధవారం మధ్యాహ్నానానికి మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తించారు. అనంతరం దగ్ధమైన కారును బళ్లారి ఆర్టీఓ పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement