మత్తయ్యకు ఏపీ పోలీసుల అండ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో నమోదైన కేసులో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న వ్యక్తి పొరుగు రాష్ర్టంలో మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు! అంతేకాదు, కేసు నమోదైన రాష్ర్టంలోని సీఎం తనను బెదిరిస్తున్నారని అతను ఫిర్యాదు చేస్తే అక్కడి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇది ఏపీలో జరిగిన విడ్డూరం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఎరజూపిన కేసులో నాలుగో నిందితుడి(ఏ4)గా ఉన్న మత్తయ్య అలియాస్ మాథ్యూస్ జెరూసలేం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.
గత నెల 31న ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత మత్తయ్య హైదరాబాద్ నుంచి పరారై విజయవాడలో తలదాచుకున్నట్లు సమాచారం. కాగా, బుధవారం ఆయన విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. స్టీఫెన్‌సన్‌ను ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యే పదవికి నామినేట్ చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.కోటి తీసుకున్నారంటూ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. తన భార్యాపిల్లలను నిర్బం ధించారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని, ప్రాణభయం ఉన్నందున రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించారు.
ఏపీ సీఎం చంద్రబాబును కేసులో ఇరికించేందుకు సహకరించాలని తెలంగాణ ఏసీబీ నుంచి స్టీఫెన్‌సన్‌కు ఒత్తిడి వచ్చిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సత్యన్నారాయణపురం పోలీసులు ‘మానవతా ధృక్పథం’తో ఆగమేఘాల మీద స్పందించి ఐపీసీ 506, 507, 387 సెక్షన్ల కింద కేసులు పెడుతూ కేసీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నిందితుడిని పట్టుకోవద్దా?
ఒక రాష్ట్రంలో నిందితుడిగా నమోదైన వ్యక్తిని మరో రాష్ర్టంలో అరెస్ట్ చేయడం సర్వ సాధారణం. దేశంలో ఎక్కడైనా చట్టం ఒకేలా ఉంటుంది. అలాంటిది తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుని, ఇప్పుడు ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా అక్కడి పోలీసులు స్పందించకపోవడం విడ్డూరం.
పోలీసులూ శిక్షార్హులే: లాయర్ శ్రీరంగారావు
ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య విజయవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వెంటనే ఆ విషయాన్ని తెలంగాణ పోలీసులకు తెలియజేయకపోవడం ఉద్దేశ్యపూర్వకంగా చేసిన నేరమని తెలంగాణ న్యాయవాదుల సంఘం కన్వీనర్ శ్రీరంగారావు అన్నారు. దేశంలో ఏపీ కూడా భాగమేనని, నిందితుడి సమాచారం ఇవ్వకపోవడం కూడా నేరమేనని అన్నారు.
నాకు ప్రాణహాని ఉంది
పోలీసులకు మత్తయ్య ఫిర్యాదు
విజయవాడ (సత్యనారాయణపురం): తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో తనకు ప్రాణహాని ఉందని దళిత క్రైస్తవ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జెరూసలేం మత్తయ్య బుధవారమిక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని మత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఏసీబీకి చెందినవారమని కూడా చెబుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివసించే తాను ప్రస్తుతం విజయవాడ గాంధీనగర్‌లో ఉంటున్నానని వెల్లడించారు. తాను ఎక్కడుంటే అక్కడికి గుర్తుతెలియని వ్యక్తులు వస్తున్నారని, కొందరు ఫోన్‌లో బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.