హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తిరుమలలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆదివారం తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సాక్షి నెట్‌వర్క్: హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తిరుమలలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆదివారం తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు, భావోద్వేగాలు రగిల్చే విధంగా ఉన్నాయని తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ తిరుపతిలో అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హనుమంతరావుపై చట్ట పరిధిలో సెక్షన్ 153 ప్రకారం రెచ్చగొట్టడం, 153 ఏ ప్రకారం ప్రాంతాల మధ్య, జనం మధ్య విద్వేషాలు ఉసిగొల్పడమనే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ మల్లికార్జున్ తెలిపారు. కాగా, వీహెచ్‌పై కేసు నమోదు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవి నాయుడు, ప్రధాన కార్యదర్శి తోట వాసు కూడా ఆదివారం తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విశాఖలోనూ ఫిర్యాదు.. : సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన వీహెచ్ 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసి సభ్యులు ఆదివారం విశాఖ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఏయూ మెయిన్‌గేట్ వద్ద వీహెచ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.