
మత్తయ్యకు ఏపీ సర్కార్ అండ!
* అందుకే అతని తరఫున హాజరైన ఏపీ పీపీ పోసాని.. న్యాయమూర్తి ముందు కేసు గురించి ప్రస్తావన
* ఓ నిందితుని తరఫున హాజరు కావడంపై న్యాయ నిపుణుల విస్మయం
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న మత్తయ్యకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోందా? హైకోర్టులో గురువారం జరిగిన పరిణామాలను గమనించిన న్యాయ నిపుణులు అవుననే అంటున్నారు. మత్తయ్య కేసీఆర్, ఆ రాష్ట్ర పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీఐడీకి బదలాయించారు. ఈ నేపథ్యంలో మత్తయ్య నేరుగా హైకోర్టును ఆశ్రయించి తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మత్తయ్య తరఫున పొనకంపల్లి రవికుమార్ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాధారణంగా ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశమే లేదు. మత్తయ్యను కాపాడుతున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ కేసును విచారణకు తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ పెద్దలకు హైకోర్టులో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ‘అధికారిక’ కార్యాలయాన్ని వేదికగా చేసుకున్నారు.
ఈ కార్యాలయం నుంచే ఆ కీలక వ్యక్తి సహాయకుడొకరు తెలంగాణ ఏసీబీ స్పెషల్ పీపీ రవికిరణ్‌రావుకు ఫోన్ చేసి, తాము మత్తయ్య కేసు గురించి న్యాయమూర్తి ముందు ప్రస్తావించి, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరనున్నామని చెప్పారు. ఆ తర్వాత మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు న్యాయమూర్తి ముందు కేసు గురించి ప్రస్తావించి మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టాలని కోరారు. మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోసాని వెంకటేశ్వర్లు హాజరై కేసు గురించి ప్రస్తావించడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ కేసులో రవికుమార్‌కు మత్తయ్య వకాలత్ ఇచ్చారే తప్ప, పోసాని వెంకటేశ్వర్లుకు కాదు. అలాంటప్పుడు న్యాయవాదులు అంత మంది ఉండగా పోసాని ఎందుకు కేసు ప్రస్తావించారనే దానిపై ఇప్పుడు హైకోర్టులో చర్చనీయాంశమైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వ్యక్తి ఓ నిందితుని తరఫున హాజరు కావడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా నిందితుని తరఫున హాజరు కావడమన్నది ఇప్పుడే జరిగింది. ఇంకో విషయమేమింటే మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూత్రా హాజరవుతున్నారు. లూత్రా వంటి సీనియర్ న్యాయవాదిని ఫీజుల పరంగా భరించేంత శక్తి మత్తయ్యకు ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.