విద్యార్థినుల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాల విద్యార్థినులు మనీషా, నందినిల మృతి సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కడపలో ప్రదర్శన నిర్వహించారు. బాలికల జూనియర్ కళాశాల, న్యూ విక్రమ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద కాసేపు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జి.సుబ్బరాజు మాట్లాడుతూ నారాయణ కళాశాలలో జరిగిన ఘటన ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ హత్యేనన్నారు.
అయితే, మంత్రి నారాయణ, కళాశాల యాజమాన్యం కలిసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కళాశాలలో జరిగిన ఈ ఘాతుకాన్ని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అంజలి, శిరీషా, అనూష, ఏబీవీపీ నాయకులు బాబూ రామ్మోహన్, శ్రీనివాసులు, సాయిప్రసాద్, శివారెడ్డి, షఫీ పాల్గొన్నారు.
బీజేవైఎం నిరసన దీక్ష
కడప నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న నందిని, మనీషాల మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ యువమోర్చా కార్యకర్తలు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్బంగా మోర్చా జిల్లా కార్యదర్శి సాయిప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాదినేని రామసుబ్బయ్య, సిటీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మరణానికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. విద్యార్థుల కుటుంబాలను నారాయణ కళాశాల యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ర్యాంకులు సాధించాలంటూ ఒత్తిడి చేయడం తగదన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు దస్తగిరి, ప్రధాన కార్యదర్శి విజయ నరసింహులు, బీజేఎంఎం నాయకులు సుదర్శన్ రాయల్, రవికుమార్ పాల్గొన్నారు.