గుంటూరు : పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు గురైన బయ్యర్లు, మార్కెట్‌యార్డు సూపర్ వైజర్ల నివాసాలపై సీబీఐ అధికారులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది సహకారంతో సీబీఐ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దాడులు చేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముగ్గురు బయ్యర్లు, ఇద్దరు మార్కెట్‌యార్డు సూపర్‌వైజర్ల నివాసాల్లో తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో బయ్యర్లు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యుల నుంచి ఆస్తుల వివరాలు, వారి కుటుంబ నేపధ్యాన్ని నమోదు చేసుకున్నారు. గుంటూరులోని రాష్ట్ర సీసీఐ కార్యాలయానికి చేరుకుని మేనేజరు జయకుమార్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాయపాటి పూర్ణచంద్రరావు, డి.రాజశేఖర్‌రెడ్డి, వరణ్ఘ్రువర్‌రెడ్డి అనే ముగ్గురు బయ్యర్లు, గుంటూరు మార్కెట్ యార్డు కార్యదర్శి రామ్మోహనరెడ్డి, పదవీ విరమణ చేసిన కార్యదర్శి హరినారాయణ నివాసాలకు వెళ్లి తనిఖీలు చేశారు. అమరావతి మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో బయ్యరు రాయపాటి పూర్ణచంద్రరావు నివాసానికి ఉదయం 9 గంటలకు రెండు కార్లలో వచ్చి సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించే సమయంలో పూర్ణచంద్రరావు ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆస్తుల, అదాయ వివరాలు, కొనుగోలు చేసిన వాహనాల వివరాలను నమోదు చేసుకున్నారు.
కృష్ణాజిల్లా నందిగామ, పెదనందిపాడు కొనుగోలు కేంద్రాలకు ఇన్‌ఛార్జిగా వ్వవహరించిన డి.వెంకటేశ్వరరెడ్డి నివాసాల్లో తనిఖీలు చేశారు. నందిగామ మార్కెట్ యార్డు కార్యాలయం నుంచి పత్తి కొనుగోలుకు చెందిన హార్డ్‌డిస్క్, గేట్‌పాస్‌బుక్‌లను తీసుకువెళ్లారు. కృష్ణాజిల్లా మైలవరం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జిగా వ్యవహరించిన వరణ్ రఘువర్‌రెడ్డి గుంటూరు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఉన్నారు. గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి, పదవీ విరమణ చేసిన సెక్రటరీ హరినారాయణలకు చెందిన గుంటూరులోని నివాసాల్లో తనిఖీ చేశారు.