సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంను రూ. 55.27 కోట్లకు ముంచేసిన మెహుల్ చోక్సీపై సీబీఐ కొత్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చోక్సీతోపాటు, చేత్నా ఝవేరి, దినేష్ భాటియా, మిలింద్ లిమాయేలతో సహా బెజెల్ జ్యువెలరీ ఫుల్ టైం డైరెక్టర్‌లపై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది.
కెనరా బ్యాంక్ నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ కంపెనీలను రూ. 55.27 కోట్ల మోసం చేసి పారిపోయిన మెహుల్ చోక్సీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. కెనరా బ్యాంక్ ,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బెజెల్ జ్యువెలరీకి వర్కింగ్ క్యాపిటల్‌గా రూ. 30 కోట్లు, రూ. 25 కోట్లు మంజూరు చేశాయి. అయితే అక్రమంగా నిధుల మళ్లించిందని బ్యాంకుల ఆరోపణ. కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో కన్సార్టియంకు రూ.55.27 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ అభియోగం.
కాగా 13,500 కోట్ల పీఎన్‌బీ స్కాంలో చోక్సీని ఇండియా రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 16న చోక్సీ ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. నాసిక్‌లో చోక్సీకి చెందిన తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. పీఎన్‌బీ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత 2018లో ఆంటిగ్వా బార్బుడా పారిపోయి అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. చోక్సీ. అయితే 2021లో అక్కడి నుంచి అదృశ్యమై డొమినికాలో తేలడం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment