తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పని చేసిన ఐఎఫ్‌ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాద్‌రావు వ్యవహారంలో సీబీఐ వేగం పెంచినట్లు తెలుస్తోంది. తణుకు పట్టణానికి చెందిన ఐఎఫ్‌ఎస్ మాజీ అధికారి రాంప్రసాదరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న ఆ రోపణలపై గతేడాది అక్టోబరులో ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయనతోపాటు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులునమోదు చేశారు. చాలా కాలం తర్వాత మరోసారి సీబీఐ అధికారులు దృష్టి సారించారు. రాంప్రసాదరావు అక్రమాస్తుల వ్యవహారంలో ఆస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గత రెండ్రోజులుగా తణుకు పరిçసర ప్రాంతాల్లోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీబీఐ నోటీసులు అందుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వంద మందికి పైగా ఈ నోటీసులు అందుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని ఏప్రిల్ మొదటి వారంలో దఫదఫాలుగా ఇచ్చిన తేదీల్లో విశాఖపట్టణంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్‌లో కేసు నమోదు
కేంద్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఫ్‌ఎస్ అధికారిగా ముత్యాల రాంప్రసాదరావు పనిచేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తణుకులోని ఆయన నివాసంపై దాడి చేసి గతేడాది అక్టోబర్ 11న కేసు నమోదు చేశారు. ఈయన గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్టణం, న్యూఢిల్లీ, మీరట్‌లలో ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.10.72 కోట్ల విలువైన చర, స్థిరాస్తి డాక్యుమెంట్లుతోపాటు రూ.37.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. రాంప్రసాదరావు అక్రమార్జన ద్వారా సంపాదించిన సొమ్ముతో ఆయన భార్య ఆకుల కనకదుర్గ తణుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో రాంప్రసాదరావుతోపాటు ఆయన భార్య కనకదుర్గ పైనా అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ప్రధానమంత్రి పేషీకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు చేసినట్లు తెలిసింది. ఈయన సంపాదించిన అక్రమ ఆస్తులతో తణుకులోని ఆయన భార్య ఆకుల కనకదుర్గ భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కనకదుర్గకు బినామీ లుగా ఉన్న కొందరు రియల్ వ్యాపారులపైనా దృష్టి సారించిన అధికారులు తాజాగా నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రియల్ వ్యాపారుల్లో గుబులు
ఐఎఫ్‌ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు, ఆయన భార్య ఆకుల కనకదుర్గ ఇంట్లో సీబీఐ అధికారుల దాడులు తదనంతరం కేసు నమోదు నేపథ్యంలో దాదాపు అయిదు నెలల తర్వాత సీబీఐ నోటీసులు జారీ చేయడంతో రియల్ వ్యాపారుల్లో గుబులు రేగుతోంది. సీబీఐ కార్యాలయం, విశాఖపట్టణం పేరుతో తపాలాశాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో అందుతున్న నోటీసులు చూసిన కొందరు ఆందోళన చెందుతున్నారు. గత పదేళ్లుగా జరిగిన క్రయవిక్రయాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆస్తులు అమ్మిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన వారికి సైతం సీబీఐ నోటీసులు జారీ చేయడం విశేషం. ఆస్తుల విక్రయించిన సమయంలో మార్కెట్ విలువ, రిజిస్ట్రార్ విలువలో వ్యత్యాసాన్ని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావాదేవీలు జరిగిన సమయంలో కొందరు రియల్ వ్యాపారులకు ఐటీరిటన్స్ లేకపోవడంపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒక్క పైడిపర్రులోనే సుమారు యాభై మంది నోటీసులు అందుకున్నట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు ఉండగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment