మరియమాతా.. వందనం
ఘనంగా ప్రారంభమైన గుణదల మాత మహోత్సవాలు
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు
గుణదల : గుణదల మాత మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు బిషప్ గ్రాసీ హైస్కూల్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా పీఠంపై ఏలూరు పీఠం మోన్సిజ్ఞోర్ తోట గాబ్రియేల్, విజయవాడ కతోలిక పీఠం మోన్సిజ్ఞోర్ పుణ్యక్షేత్రం రెక్టర్ ఎం. చిన్నప్ప, చాన్సలర్ ఫాదర్ జె. జాన్‌రాజు, సోసల్ సర్వీస్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, కేథలిక్ డయోసిస్ కోశాధికారి ఎం. గాబ్రియేల్ తదితర గురువులు దివ్యబలిపూజ సమర్పణ చేసి మహోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. పదిగంటలకు ఫాదర్లు లాము జయరాజ్, పసల థామస్‌లచే దివ్యసత్ప్రసాద ఆరాధన, స్వస్థత ప్రార్థనలు జరిగాయి. 11గంటలకు భక్తుల కోసం ఫాదర్ జోజిబాబు దివ్యపూజాబలిని సమర్పించారు. సాయంత్రం 6గంటలకు ఏలూరు కతోలిక పీఠం మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర సమష్టి దివ్యపూజాబలిని సమర్పించారు. ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేరతో పాటు విజయవాడ పీఠం ఇన్‌చార్జి బిషప్ గోవిందు జోజి పాల్గొన్నారు. తొలిరోజు ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మరియమాత స్వరూపం వద్ద, కొండ శిఖరాన క్రీస్తు శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి, కొవ్వొత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గుణదల ప్రేయర్ టీమ్ వారి భక్తి కీర్తనలు ఆహూతులను భక్తి తన్మయత్వంలో ముంచాయి.
భారీగా అన్నదానం
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఫుణ్యక్షేత్రం ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన అన్నప్రసాద వితరణ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రసాదం స్వీకరించారు. బనిగండ్లపాడు బృందం చేసిన కోలాట ప్రదర్శనను ఫాదర్ టీ అగస్టీన్ పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను పరవశింపచేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా నిర్వహించిన కార్యక్రమాలను చిన్నా పెద్ద ఉత్సాహంగా తిలకించారు.భక్తులు భారీగా రావడంతో కొబ్బరికాయ ధరలు సైజును బట్టి 15 నుంచి 30 వరకు పలికాయి. అలాగే క్యాండిల్స్ పది నుంచి 50 రూపాయల వరకు అమ్మారు.
మాస్క్‌లతో విధులు
పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తదితర సిబ్బంది మాస్క్‌లను ధరించి విధులను నిర్వహించారు. అలాగే దర్శనానికి వచ్చిన భక్తులు సైతం కొంతమంది మాస్క్‌లతోనే పూజలు చేశారు.
కనులపండువగా తేరు ప్రదక్షిణ
గుణదలమాత తేరు ప్రదక్షిణ ఘనంగా సాగింది. పూలతో అలంకరించిన పల్లకీలో మరియమాతను ఉంచి పురవీధుల్లో మేళతాళాలు, డప్పువాయిద్యాలు, కోలాట నృత్యాలు, భక్తి ప్రార్థనల నడుమ ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, కార్పొరేటర్ బొప్పన భవకుమార్ పల్లకీ మోశారు. కార్యక్రమంలో రెక్టర్ ఎం. చిన్నప్ప, పెద్ద సంఖ్యలో గురువులు పాల్గొన్నారు.