కీసర, న్యూస్‌లైన్: అపూర్వ రీతిలో 150 మంది విద్యార్థులు స్వామి వివేకానంద వేషధారణలతో అపురూపంగా నిలిచారు. యువతకు వివేకాందుడు మార్గదర్శి అని, ఆయన బోధనలు అందరూ పాటించాలని వక్తలు సూచించారు. ఆదివారం శ్రీ వివేకానంద సెరినిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని చీర్యాల చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో చీర్యాల సెరినిటీ పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులు వివేకానందుడి వేషధారణలో మానవ హారం నిర్వహించారు. సెరినిటీ పాఠశాల నుంచి విద్యార్థులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. వివేకానంద వేషధారణలో విద్యార్థులు ర్యాలీగా నగరంలోని రామకృష్ణమఠం వరకు వెళ్లారు.
విద్యార్థులు నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కీసర వెంకటసాయి థియేటర్‌లో ‘స్వామి వివేకానంద- ది యూత్ ఐకాన్’ డాక్యుమెంటరీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ దర్శకుడు సురేష్ బుజ్జి మాట్లాడుతూ.. వివేకానందుడి ఆదర్శాలు, ఆశయాలు నేటి తరానికి కొంతమేరకైనా అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. డాక్యుమెంటరీలో సెరినిటీ పాఠశాలకు చెందిన 150 విద్యార్థులు నటించారని ఆయన చెప్పారు. చిత్ర దర్శకుడిని, నిర్మాత జీఆర్ రెడ్డిని చీర్యాల దేవాలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముప్పురాంరెడ్డి, చీర్యాల సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ తదితరులు సత్కరించారు. అనంతరం చీర్యాల చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడవాలని, దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మేడ్చల్ ఇన్‌చార్జి నక్కా ప్రభాకర్ గౌడ్, బీజేపీ నేత కొంపల్లి మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు నానునాయక్, ఖలీల్, అనిల్, బచ్‌పన్ స్కూల్స్ రాష్ట్ర డెరైక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అపూర్వం.. అపురూపం!
Published Mon, Jan 13 2014 12:22 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement