ప్రతి ఇంటా పండుగ జరుపుకోవాలి | Celebrations Of YS Rajashekar Birthday In Srikakulam District | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటా పండుగ జరుపుకోవాలి

Published Tue, Jul 9 2019 6:28 AM | Last Updated on Tue, Jul 9 2019 6:29 AM

Celebrations Of YS Rajashekar Birthday In Srikakulam District - Sakshi

సాక్షి, నరసన్నపేట : రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, వారి శ్రేయస్సుకు అన్ని విధాలా దోహద పడుతుందని, రైతు పక్షపాత ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతే రాజు అని రానున్న ఐదేళ్లలో నిరూపిస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిందంటే రైతులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో రైతులు గమనించాలని మంత్రి అన్నారు. సోమవారం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి రైతు దినోత్సవాన్ని వ్యవసాయ శాఖ జేడీ రత్నకుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు.

దీంట్లో పాల్గొన్న మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ ఇప్పటికే రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, రైతు భరోసాతోపాటు అనేక పథకాలు ప్రకటించిందన్నారు. ఏటా రైతులకు రూ.12,500లను పెట్టుబడి రాయితీ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే వడ్డీలేని రుణాలు, ఉచిత పంటల బీమా అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. వ్యవసాయ జిల్లాగా గుర్తింపు పొందిన శ్రీకాకుళంలో రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి జిల్లా యంత్రాంగం సహరించాలని కోరారు. జిల్లాలో ప్రతీ ఎకరాకూ సాగు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రతి రైతుకూ వడ్డీలేని రుణం: కలెక్టర్‌
జిల్లాలో రైతులు ఖరీఫ్‌ కాలంలో పెట్టుబడుల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గుర్తించామని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ రైతుకూ వడ్డీలేని రుణం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ చెప్పారు. రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ రైతులకు 65 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు.

19,690 మందికి ఎల్‌ఈసీ కార్డులు ఇచ్చామని, వారందరికీ రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఉద్యావన పంటలు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉద్దానంలో తిత్లీకి దెబ్బతిన్న 15 వేల హెక్టార్లులో కొబ్బరి తోటలను ఎన్‌ఆర్‌ఈజీ ఎస్‌లో భాగంగా మళ్లీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నీటి వనరులు లేని చోట్ల డ్రిప్‌ ఇరిగేషన్‌కు ప్రాధాన్యతనిస్తున్నామని 90 శాతం సబ్సిడీతో అవసరమైన పరికరాలు అందిస్తున్నామన్నారు.

వ్యవసాయ శాఖ జేడీ రత్నకుమార్‌ మాట్లాడుతూ ప్రతి హెక్టారుకు 5,400 కిలోల ధాన్యం ఉత్పత్తి చేయాలనే లక్ష్యం తో ఈ ఖరీఫ్‌లో పనిచేస్తున్నామని, 2.12 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుందన్నారు. వంశధార, నాగావళి, తోటపల్లి, మడ్డువలస తది తర ప్రాజెక్టుల ద్వారా ప్రతీ ఎకరాకు సాగు నీరు అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

తరలివచ్చిన మహిళా రైతులు
వ్యవసాయ శాఖ నరసన్నపేటలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రైతు సదస్సుకు మహిళా రైతులు భారీగా తరలివచ్చారు. రైతులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇదే సభా వేదికపై నరసన్నపేట మండలానికి చెందిన పింఛనుదారులకు వైఎస్సార్‌ భరోసా పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. అలాగే ఆదర్శ రైతులకు సత్కారం చేశారు. స్టేట్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల పరిధిలో ఉన్న రైతు సంఘాలకు, రుణాలు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, లీడ్‌బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ్వరరావుతోపాటు జిల్లా స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ ఏడీలు జి.సత్యవతి, వడ్డాది శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement