సాక్షి, అమరావతి : వైఎస్సార్.. ఆయన ప్రతీ అడుగు రైతు కోసమే.. ప్రతీ ఆలోచన రైతు సంక్షేమం కోసమే.. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసి అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలిసంతకంతో మొదలైన తన పాలనలో విద్యుత్ బకాయిల మాఫీ, రుణమాఫీ, గిట్టుబాటు వ్యవసాయం, సహకార రంగానికి ఆర్థిక చేయూత, జలయజ్ఞం వంటి కార్యక్రమాలతో అన్నదాత గుండెల్లో దైవంగా నిలిచారు.
ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పైలుపై మొదటి సంతకం చేశారు. అప్పటివరకు ఉన్న విద్యుత్ బకాయిలు రూ.1,100 కోట్లను ఒక్క సంతకంతో మాఫీచేశారు. తాను అధికారంలో ఉన్నంత కాలం ఉచిత విద్యుత్‌ను సమర్ధవంతంగా అమలుచేసి ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలు బట్టలు ఆరబెట్టుకోడానికే ఉపయోగపడతాయంటూ హేళన చేసిన నాటి ప్రతిపక్ష నేతల నోళ్లకు తాళాలు వేశారు. ఈ పథకం ద్వారా నేడు తెలుగు రాష్ట్రాల్లో 40.25 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. పైసా భారంలేకుండా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. వైఎస్సార్ బాటలోనే ఇప్పుడు తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రుణమాఫీని అమలుచేయించిన ఘనత వైఎస్సార్‌దే. ఈ పథకం కింద అత్యధికంగా సుమారు రూ.12 వేల కోట్లకు పైగా లబ్ధిపొందింది ఏపీ రైతులే. ఇక రుణమాఫీ దక్కని 36లక్షల మంది రైతులకూ లబ్ధిచేకూర్చాలనే లక్ష్యంతో ఒకొక్కరికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహం కింద రూ.1,800 కోట్లు వారి ఖాతాలో నేరుగా జమచేశారు. టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకూ రూ.2 లక్షల పరిహారాన్ని అందజేసి వైఎస్ ఆదుకున్నారు.
గిట్టుబాటు వ్యవసాయం.. సహకారానికి సాయం
1999లో క్వింటాల్‌కు రూ.490లు ఉన్న ధాన్యం మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550లకు చేరింది. అంటే ఐదేళ్లలో పెరిగిన మద్దతు ధర కేవలం రూ.60 (12.5 శాతం). అలాంటిది 2004-09 మధ్య రూ.550 నుంచి రూ.1,000లకు మద్దతు ధర పెరిగింది. వైఎస్సార్ హయాంలో పెరిగిన మద్దతు ధర అక్షరాల రూ.450 (82.5 శాతం). ధాన్యం ఒక్కటే కాదు అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు అదే స్థాయిలో పెరిగేందుకు కృషిచేశారు. మహానేత హయాంలో మద్దతు ధరల కంటే ఎక్కువ మొత్తానికి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగారు. మరోవైపు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 డీసీసీబీల్లో 18 దివాళ తీసేస్థాయికి చేరుకోగా, వైద్యనాథన్ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800కోట్ల సాయమందించి వాటిని లాభాలబాట పట్టించారు. సహకార వ్యవస్థకు జవసత్వాలు కల్పించి గాడిలో పడేటట్లు చేశారు.
జలయజ్ఞం.. కరువుకు కళ్లెం
2004 నాటికి రాష్ట్రంలో సాగునీటి వనరులున్న వ్యవసాయ విస్తీర్ణం 80లక్షల ఎకరాలు మాత్రమే. కానీ, బీడు భూములన్నింటినీ సశ్యశ్యామలం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా.. రూ.లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు జలయజ్ఞం కింద 86 ప్రాజెక్టులు చేపట్టారు. రూ.54 వేల కోట్లు ఖర్చుచేసి 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తిచేశారు. 23.49 లక్షల ఎకరాలకు కొత్తగా నీరందించగా, 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడమే కాదు ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. కుడిఎడమ కాలువలను దాదాపు పూర్తిచేశారు. జలయజ్ఞంలో చేపట్టిన పనుల్లో 70 శాతం పూర్తిచేశారు. రాష్ట్రం నుంచి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతీ లబ్ధిదారునికి రూ.30 వేల రాయితీతో రూ.1.50 లక్షల విలువైన పాడి పశువులను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment