కర్నూలు:
చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప, నెల్లూరు జిల్లాలకే పరిమితమైన ఎర్రచందనం అక్రమ రవాణా కర్నూలు జిల్లాలోనూ విస్తరిస్తోంది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో అడపాదడపా దుంగలు పట్టుబడటం తెలిసిందే. తాజాగా వెల్దుర్తి వద్ద దాదాపు రూ.40కోట్ల విలువ చేసే దుంగలు ఓ గుజిరీ గోడౌన్‌లో బయటపడటం చూస్తే ఈ అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో తెలియజేస్తోంది.
ఈ బాగోతం వెనుక అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విస్తారంగా లభిస్తోంది. అక్రమార్కులు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన కూలీలతో ఈ దుంగలను జపాన్, చైనా దేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డొస్తే ఎంతటి వారినైనా మట్టుబెట్టేందుకూ వెనుకాడని పరిస్థితి. ఇటీవల చిత్తూరు జిల్లా అటవీ అధికారులు స్మగ్లర్ల చేతిలో దారుణ హత్యకు గురవడం ఇందుకు నిదర్శనం. ప్రతిగా ఒకరిద్దరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో పాటు వందలాది మందిని అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో ఎర్ర దొంగలు రూటు మార్చారు. అక్రమ రవాణాకు కర్నూలు జిల్లాను అడ్డాగా మార్చుకుంటున్నారు. అటవీ, పోలీసు శాఖలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా అక్రమార్కులు సరికొత్త దారులు వెతుక్కుంటున్నారు. శేషాచలం అడవిలోని ఎర్ర చందనం దుంగలను అధికారుల కళ్లుగప్పి చిత్తూరు, పుత్తూరు, పీలేరు మీదుగా చెన్నై, కర్ణాటక ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం నిఘా పెరగడంతో కర్నూలు జిల్లాను అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. సేకరించిన దుంగలను అటవీ మార్గంలో ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో కర్నూలుకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైఎస్‌ఆర్ కడప జిల్లా కోడూరుకు చెందిన గంగిరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన రమేష్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డిలు మరికొందరితో కలసి జాతీయ రహదారి పక్కనున్న గోదాములను అద్దెకు తీసుకున్నారు.
అందులో ఒకటి వెల్దుర్తి వద్దనున్న గుజిరీ గోదాము. గత నెల 28న డోన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యంరెడ్డిలు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా వెల్దుర్తి వైపు నుంచి వస్తున్న లారీని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా 228 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. లారీ క్లీనర్ రాంబాబు, కర్నూలుకు చెందిన సోమసుందర్‌గౌడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్దుర్తి కేంద్రంగా ఈ బాగోతం నడుస్తున్నట్లు గుర్తించారు.
అందరికీ ఆమ్యామ్యాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం దుంగలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో నంబర్-1 క్వాలిటీ ఎర్రచందనం టన్ను ధర రూ.20లక్షల పైమాటే. ఒక్క కంటైనర్‌ను ఇతర దేశాలకు తరలిస్తే సుమారు పది మంది వరకు కోటీశ్వరులవుతున్నారు. వారితో పాటు కూలీలు, కొందరు పోలీసులు, అటవీ, చెక్‌పోస్టు అధికారులు, లారీ, కంటైనర్ డ్రైవర్లు లక్షాధికారులవుతున్నారు. డబ్బుకు ఆశపడి అధికారులు కొందరు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణాకు మార్గం సుగమం చేస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద స్థాయిలో వాహనాల్లో అక్రమ రవాణా సాగుతున్నా మార్కెట్‌యార్డుల చెక్‌పోస్టుల్లో సిబ్బంది ఏమి చేస్తున్నట్లు ప్రశ్న తలెత్తుతోంది. ఎవరి స్థాయిలో వారు మామూళ్లతో సరిపెట్టుకోవడం వల్లే దుంగల దొంగలు చేలరేగినట్లు తెలుస్తోంది.