ప్రతి ఊళ్లో సిమెంట్ రోడ్లు : సీఎం
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని గ్రామాలలో రహదారులన్నీ సిమెంట్ రోడ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గ్రామాల అనుసంధాన రహదారులనూ అదేవిధంగా మార్చాలన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ప్రతి గ్రామంలో వాటర్ హార్వేస్టింగ్ స్ట్రక్చర్లు యుద్ధప్రాతిపదికన నిర్మించడంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. రాబోయే నాలుగేళ్ల కాలంలో గ్రామాల రూపురేఖలే మారేలా ఆ ప్రాంతాల్లో అనూహ్య అభివృద్ధి చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బులు ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. 13 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున చెత్త నుంచి విద్యుత్‌ను తయారీ చేసే కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 13,921 కి.మీ. మేర పంచాయతీ రహదారులను ఆధునికీకరణ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. 5- 10 వేల కి.మీ. గ్రామీణ ప్రాంతాల రహదారులను ఆర్ అండ్ బీ శాఖకు, ఈ-పంచాయతీల్లో ఆన్‌లైన్ సర్వీసులను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని సీఎం సూచించారు.