
చెన్నూరు వాసి ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్/చెన్నూరు :
చెన్నూరుకు చెందిన మచ్చా వెంకటసుబ్బయ్య (50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అరుుతే ఎస్‌ఐ హనుమంతు కొట్టడం వల్లనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితుడు, అతని కుటుంబ సభ్యుల కథనం మేరకు ...చెన్నూరు కొత్త రోడ్డులో మచ్చా వెంకట సుబ్బయ్య కూల్‌డ్రింక్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. కొత్తరోడ్డులోని షాపుల ముందు ఎలాంటి అడ్డంకులు పెట్టకూడదని ఎస్‌ఐ హనుమంతు చెప్పేవారు.
అందరితోపాటు సమానంగా తమ షాపు నిర్వహిస్తున్నప్పటికీ గత మూడు నెలల నుంచి పదేపదే తమ షాపు వద్దకు వచ్చి అడ్డంకులు ఉన్నాయని వేధించేవారు. అలాగే తమ మోటారు సైకిల్ షాపు లోపల ఉన్నప్పటికీ రూ. 200 జరిమాన విధించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరులోకి తమ కుమారుడు జనార్దన్ మోటారు సైకిల్‌లో వెళ్లి వస్తుండగా, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాడని రూ. 1000 జరిమాన విధించారని తెలిపారు. ఈ సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిన నేపధ్యంలో మంగళవారం రాత్రి 6.30-7.00 గంటల సమయంలో వెంకట సుబ్బయ్య తన షాపులో కుర్చీలో కూర్చొని ఉండగా, ఎస్‌ఐ హనుమంతు తన జీపులో వేగంగా వచ్చి షర్టు పట్టుకొని కొట్టాడని ఆరోపించారు.
చుట్టుపక్కల వారు గమనించడం, అనవసరంగా కొట్టాడని ఆవేదనతో ఇంట్లో ఉన్న వాస్మోల్‌ను సేవించాడు. వెంటనే భార్యాపిల్లలు గమనించి పక్కకు తోసేశారు. దీంతో అస్వస్థతకు గురైన వెంకట సుబ్బయ్యను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తీసుకొచ్చారు.
ఎస్‌ఐ వివరణ
అ సంఘటనపై చెన్నూరు ఎస్‌ఐ హనుమంతును వివరణ కోరగా, చెన్నూరు కొత్తరోడ్డు వన్‌వే కావడం, కూల్‌డ్రింక్ షాపులు నిర్వాహకులైన ఎం. వెంకట సుబ్బయ్య, ఆ పక్కనే మరో సుబ్బయ్యలను పదేపదే ముందుకు రావద్దని తెలియజెప్పినా వినిపించుకోలేదన్నారు. అలాగే టెంకాయలు ముందు వైపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం సాయంత్రం తమ సిబ్బందితో షాపు ముందు వెంకట సుబ్బయ్య కుర్చీలో కూర్చొని వాహనదారులకు ఇబ్బందులు కలగజేయడంతో అతన్ని తమ సిబ్బంది లాగే ప్రయత్నం చేశారన్నారు. అంతేగానీ తానుగానీ, తమ సిబ్బందిగానీ కొట్టలేదన్నారు.