కేంద్రం విధానాలతోనే రైతుకీ దుస్థితి..! | Center vidhanalatone farmer distress ..! | Sakshi
Sakshi News home page

కేంద్రం విధానాలతోనే రైతుకీ దుస్థితి..!

Published Thu, Jan 22 2015 1:30 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

కేంద్రం విధానాలతోనే రైతుకీ దుస్థితి..! - Sakshi

కేంద్రం విధానాలతోనే రైతుకీ దుస్థితి..!

ఏఎన్‌యూ : దేశంలో ప్రధానరంగమైన వ్యవసాయంపై కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరించటం వల్లనే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ర్ట శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, చెన్నైకి చెందిన డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా మూడు రోజులపాటు వర్సిటీలో నిర్వహించిన ‘అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు బుధవారంతో ముగిశాయి.
 
ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ జీవితమంతా వ్యవసాయ రంగం అభివృద్ధికి కేటాయించారన్నారు. ఆయన నేతృత్వంలో వ్యవసాయ రంగంలో సమస్యల అధ్యయనంపై గతంలో కేంద్రప్రభుత్వం కమిటీలు వేసిందనీ, ఆయన ఇచ్చిన నివేదికలపై కనీసం పార్లమెంటులో చర్చ కూడా జరగకపోవటం దురదృష్టకరమన్నారు. దీన్నిబట్టే వ్యవసాయాభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని తెలుస్తోందన్నారు.
 
వ్యవసాయరంగ అభివృద్ధికి సుస్థిరమైన విధానాలు ఉండాలన్నారు. మనదేశంలో పౌష్టికాహార లోపం వల్ల వస్తున్న అనేక వ్యాధులను నిర్మూలించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. 2025 నాటికి భారత్‌ను ప్రపంచశక్తిగా నిలపగల సత్తా యువతకే ఉందన్నారు. లాభసాటి రంగమైన వ్యవసాయంలో నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందని, రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉండడం విచారకరమన్నారు.
 
పట్టణీకరణ, రియల్ ఎస్టేట్‌ల పేరుతో సాగుభూమిని ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని దీని వల్ల వ్యవసాయం తగ్గిపోతుందన్నారు. ఆహార భద్రత చట్టం తేవటం మంచి పరిణామమేనని, ఇదే సమయంలో వ్యవసాయరంగ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడం వల్ల చాలా మంది రైతులు ప్రైవేటు పరంగా ఆర్థిక సహకారాన్ని పొందుతున్నారన్నారు.
 
రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందుకు సాగితేనే గిట్టుబాటు ధర సాధ్యమన్నారు. దేశమంతటా ఒకే మార్కెట్ విధానం ఉండాలని పేర్కొన్నారు.
 
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార, సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ ప్రజలను నైపుణ్యవ ంతులుగా తయారు చేసేందుకు దోహదం చేయాలన్నారు. యువ త సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి మూలస్తంభాలుగా నిలవాలన్నారు.
 
నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రజల జీవనవిధానాన్ని మార్చే దిశగా యువత చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార భద్రతకు పరిష్కారాలు కనుగొనే దిశగా నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయన్నారు.
 
తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలన్నారు. స్వామినాథన్ ఫౌండేషన్ ఈడీ డాక్టర్ అజయ్‌ఫరీదా నివేదిక సమర్పించారు. కార్యక్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, స్వామి నాథన్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ పరశురామన్, డాక్టర్ రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, అధ్యాపకులు డాక్టర్ జె. చెన్నారెడ్డి పలువురు శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement