రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన?
హైదరాబాద్ : రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా నియమించే సాహసం కాంగ్రెస్ చేస్తుందనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రాష్ట్రపతి పాలనే. మరీ గవర్నర్ ఎలాంటి సిఫార్సు చేస్తారో చూడాలి.
రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకుల్ని చూసిన ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి 1973 జనవరి 11న రాష్ట్రపతి పాలన విధించారు. నాడు విధించిన పాలన డిసెంబర్ 10, 1973 వరకు కొనసాగింది. ఆ తర్వాత బహుశా మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తింది. నాడు పీపీ నరసింహరావు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. మరో వైపు రాష్ట్రపతి పాలన అనివార్యమైతే రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్ర గవర్నర్‌గా హన్స్‌రాజ్ భరద్వాజ్ లేదా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను నియమించే అవకాశం ఉంది.