సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి
రాయలసీమకు నీళ్లందించామని చెబుతున్న టీడీపీ నాయకులు వాస్తవాలను మరుగున పెడుతున్నారు. అసలు విషయాలను వక్రీకరిస్తున్నారు. గాలేరు–నగరి, హంద్రీ– నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సాగునీటిని అందించామని అసత్యాలు చెబుతున్నారు. ఈ కరువునేలకు నీళ్లొచ్చాయంటే ఆ ఘనత నాటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు..వైఎస్ రాజశేఖరరెడ్డిల వల్లేనని మరిచిపోతున్నారు వీరు. తాజాగా తమ నాయకుడు చంద్రబాబు ఘనత వల్ల నీరొచ్చిందని ప్రచారం చేసుకోడానికి వీరికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావడం లేదు.
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సాగునీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అనడానికి టీడీపీ నేతలకు నోరు ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. బాబు జమానాలో ప్రాజెక్టులను నాన్ ప్రియారిటీ కింద చేర్చడం వల్ల మిగులు జలాలపై హక్కు కోల్పొవాల్సి వచ్చిందన్న విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తే ఎలా? నేడు కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లొచ్చాయంటే అది ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిల ఘనతేనని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గత 36 ఏళ్లుగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం జరుగుతున్న ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధే తన శ్వాసగా, ధ్యాసగా జీవిస్తున్న ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు.
సాక్షి: సీమకు నీళ్లిచ్చిన ఘనత బాబుదేనంటున్నారు?
సీహెచ్ : ఈ మాట అనడానికి ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులకు నోరెలా వస్తుందో అర్థం కావడం లేదు. చాలా ప్రమాదకరమైన చరిత్ర వక్రీకరణ. ఇది క్షమార్హం కాదు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు 36 సంవత్సరాలు గడిచాయి. ఇంతలోనే టీడీపీ నేతలు చరిత్రకు వక్రభాష్యాలు చెప్పడం దారుణం.
సాక్షి: ప్రాజెక్టులు ఎలా వచ్చాయి?
సీహెచ్ : 1983లో తెలుగుగంగ ప్రాజెక్టును ఎన్టీఆర్ చేపట్టారు. ఆ ప్రాజెక్టు వల్ల తమకు నీరు రాదని తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ కమిటీ (ఏసీఆర్‌ఎస్‌వై), ప్రజా సంఘాలు, సీపీఐ, సీపీఎం నాయకులు కృష్ణా జలాల కోసం ఉద్యమించారు. ఆ ఉద్యమం పట్ల నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చాలా పాజిటివ్‌గా స్పందించి తెలుగుగంగతోపాటు గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులను ప్రకటించారు. అందుకే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి చెందినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇలా వైఎస్ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.
సాక్షి: బాబు హయాంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటీ?
సీహెచ్ : చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన రాయలసీమ ప్రాజెక్టులను నాన్ ప్రయారిటీ జాబితా కింద చేర్చడం ద్వారా సీమకు తీవ్ర ద్రోహం చేశారు. 2000 సంవత్సరం నాటికి బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తుందని తెలిసినప్పటికీ ఆయన ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కృష్ణా జలాల పునః సమీక్ష నాటికి చంద్రబాబు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే కృష్ణా మిగులు జలాలను కేటాయించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించేందుకు అవకాశం ఉండేది.
సాక్షి: ప్రాజెక్టుల పట్ల వైఎస్ ముందుచూపు ఎలాంటిది?
సీహెచ్ : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం అప్పట్లో 11500 క్యూసెక్కులు ఉండేది. హెడ్ రెగ్యులేటర్‌తోపాటు పోతిరెడ్డిపాడు–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు గల మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని వైఎస్ 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అలా పెంచకపోతే భవిష్యత్తులో రాయలసీమకు సాగునీరు అందే అవకాశం ఉండదనే ముందుచూపుతోనే ఆయన అలా చేశారు. కాగా అప్పట్లో సీపీఐ మినహా అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వైఎస్ ఎవరని లెక్క చేయలేదు.
సాక్షి: దుమ్ముగూడెం–సాగర్ టెయిల్‌పాండ్ పరిస్థితి ఏమిటీ?
సీహెచ్ : వైఎస్ చాలా దూరదృష్టితో ఆలోచించారు. భవిష్యత్తులో కృష్ణా జలాలు సరిపోవని, గోదావరి జలాలను మళ్లించాల్సిన అవసరం ఉందని భావించారు. పోలవరం కూడా మన అవసరాలను తీర్చలేదని ఆయన గుర్తించారు. దుమ్ముగూడెం పాయింట్‌లో 80 రోజులపాటు వరద ఉంటుంది. ఆ నీటిని నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌కు మళ్లించాలని వైఎస్ నిర్ణయించారు.
సాక్షి: దీనిపై అభ్యంతరాలు రాలేదా?
సీహెచ్ : కొందరు నిపుణులు అభ్యంతరాలు చెప్పారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టులో కొంత, సింగరేణి గనుల భూములు, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కొంత ఆయకట్టు ముంపునకు గురవుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై నాటి వైఎస్ ప్రభుత్వం అధ్యయనం చేయించింది. మునక లేకుండా రీ డిజైన్ చేసి 19521 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మించేందుకు పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ 2009 ఫిబ్రవరి 6న జీఓ 22 జారీ చేశారు. ఈ స్కీములు పది ప్యాకేజీల కింద విభజించి ఈపీసీ స్కీమ్ కింద ఏజెన్సీలకు అప్పగించారు. రాష్ట్ర విభజనకు ఆరు సంవత్సరాల ముందే ఇదంతా జరిగింది.
సాక్షి : వైఎస్ ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
సీహెచ్: ‘సీమ’ ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గాలేరు–నగరి ప్రాజెక్టు డిజైన్‌లో తొలుత పైడిపాలెం రిజర్వాయర్ లేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకనే పైడిపాలెం రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. జీఎన్‌ఎస్‌ఎస్, పైడిపాలెం, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టుల పనులు అత్యంత వేగంగా ముందుకు సాగాయి. ఆయన హయాంలో 80 శాతం పైబడి పనులు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment