CH chandra shekar reddy
-
‘చంద్రబాబుకు నీటి గురించి మాట్లాడే అర్హత లేదు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ హయాంలో రాయలసీమకు మేలు జరిగిందని రాయలసీమ కార్మిక, కర్షక పరిషత్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు మేలు చేశారన్నారు. చంద్రబాబుకు, రాయలసీమ టీడీపీ నేతలకు నీటి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. మైసూరారెడ్డి విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ప్రయోజనాల కోసం కృషిచేస్తున్నారన్నారు. రాయలసీమలోని మేధావులు, రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని చంద్రశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
రాయలసీమకు నీరిచ్చామనడటం చరిత్ర వక్రీకరణ
రాయలసీమకు నీళ్లందించామని చెబుతున్న టీడీపీ నాయకులు వాస్తవాలను మరుగున పెడుతున్నారు. అసలు విషయాలను వక్రీకరిస్తున్నారు. గాలేరు–నగరి, హంద్రీ– నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సాగునీటిని అందించామని అసత్యాలు చెబుతున్నారు. ఈ కరువునేలకు నీళ్లొచ్చాయంటే ఆ ఘనత నాటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు..వైఎస్ రాజశేఖరరెడ్డిల వల్లేనని మరిచిపోతున్నారు వీరు. తాజాగా తమ నాయకుడు చంద్రబాబు ఘనత వల్ల నీరొచ్చిందని ప్రచారం చేసుకోడానికి వీరికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావడం లేదు. సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సాగునీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అనడానికి టీడీపీ నేతలకు నోరు ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. బాబు జమానాలో ప్రాజెక్టులను నాన్ ప్రియారిటీ కింద చేర్చడం వల్ల మిగులు జలాలపై హక్కు కోల్పొవాల్సి వచ్చిందన్న విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తే ఎలా? నేడు కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లొచ్చాయంటే అది ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిల ఘనతేనని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గత 36 ఏళ్లుగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం జరుగుతున్న ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధే తన శ్వాసగా, ధ్యాసగా జీవిస్తున్న ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. సాక్షి: సీమకు నీళ్లిచ్చిన ఘనత బాబుదేనంటున్నారు? సీహెచ్ : ఈ మాట అనడానికి ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులకు నోరెలా వస్తుందో అర్థం కావడం లేదు. చాలా ప్రమాదకరమైన చరిత్ర వక్రీకరణ. ఇది క్షమార్హం కాదు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు 36 సంవత్సరాలు గడిచాయి. ఇంతలోనే టీడీపీ నేతలు చరిత్రకు వక్రభాష్యాలు చెప్పడం దారుణం. సాక్షి: ప్రాజెక్టులు ఎలా వచ్చాయి? సీహెచ్ : 1983లో తెలుగుగంగ ప్రాజెక్టును ఎన్టీఆర్ చేపట్టారు. ఆ ప్రాజెక్టు వల్ల తమకు నీరు రాదని తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ కమిటీ (ఏసీఆర్ఎస్వై), ప్రజా సంఘాలు, సీపీఐ, సీపీఎం నాయకులు కృష్ణా జలాల కోసం ఉద్యమించారు. ఆ ఉద్యమం పట్ల నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చాలా పాజిటివ్‌గా స్పందించి తెలుగుగంగతోపాటు గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులను ప్రకటించారు. అందుకే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి చెందినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇలా వైఎస్ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సాక్షి: బాబు హయాంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటీ? సీహెచ్ : చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన రాయలసీమ ప్రాజెక్టులను నాన్ ప్రయారిటీ జాబితా కింద చేర్చడం ద్వారా సీమకు తీవ్ర ద్రోహం చేశారు. 2000 సంవత్సరం నాటికి బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తుందని తెలిసినప్పటికీ ఆయన ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కృష్ణా జలాల పునః సమీక్ష నాటికి చంద్రబాబు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే కృష్ణా మిగులు జలాలను కేటాయించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించేందుకు అవకాశం ఉండేది. సాక్షి: ప్రాజెక్టుల పట్ల వైఎస్ ముందుచూపు ఎలాంటిది? సీహెచ్ : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం అప్పట్లో 11500 క్యూసెక్కులు ఉండేది. హెడ్ రెగ్యులేటర్‌తోపాటు పోతిరెడ్డిపాడు–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు గల మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని వైఎస్ 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అలా పెంచకపోతే భవిష్యత్తులో రాయలసీమకు సాగునీరు అందే అవకాశం ఉండదనే ముందుచూపుతోనే ఆయన అలా చేశారు. కాగా అప్పట్లో సీపీఐ మినహా అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వైఎస్ ఎవరని లెక్క చేయలేదు. సాక్షి: దుమ్ముగూడెం–సాగర్ టెయిల్‌పాండ్ పరిస్థితి ఏమిటీ? సీహెచ్ : వైఎస్ చాలా దూరదృష్టితో ఆలోచించారు. భవిష్యత్తులో కృష్ణా జలాలు సరిపోవని, గోదావరి జలాలను మళ్లించాల్సిన అవసరం ఉందని భావించారు. పోలవరం కూడా మన అవసరాలను తీర్చలేదని ఆయన గుర్తించారు. దుమ్ముగూడెం పాయింట్లో 80 రోజులపాటు వరద ఉంటుంది. ఆ నీటిని నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌కు మళ్లించాలని వైఎస్ నిర్ణయించారు. సాక్షి: దీనిపై అభ్యంతరాలు రాలేదా? సీహెచ్ : కొందరు నిపుణులు అభ్యంతరాలు చెప్పారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టులో కొంత, సింగరేణి గనుల భూములు, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కొంత ఆయకట్టు ముంపునకు గురవుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై నాటి వైఎస్ ప్రభుత్వం అధ్యయనం చేయించింది. మునక లేకుండా రీ డిజైన్ చేసి 19521 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మించేందుకు పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ 2009 ఫిబ్రవరి 6న జీఓ 22 జారీ చేశారు. ఈ స్కీములు పది ప్యాకేజీల కింద విభజించి ఈపీసీ స్కీమ్ కింద ఏజెన్సీలకు అప్పగించారు. రాష్ట్ర విభజనకు ఆరు సంవత్సరాల ముందే ఇదంతా జరిగింది. సాక్షి : వైఎస్ ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? సీహెచ్: ‘సీమ’ ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గాలేరు–నగరి ప్రాజెక్టు డిజైన్‌లో తొలుత పైడిపాలెం రిజర్వాయర్ లేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకనే పైడిపాలెం రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. జీఎన్ఎస్ఎస్, పైడిపాలెం, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టుల పనులు అత్యంత వేగంగా ముందుకు సాగాయి. ఆయన హయాంలో 80 శాతం పైబడి పనులు పూర్తయ్యాయి. -
రాష్ట్ర విభజన తగదు
వైవీయూ, న్యూస్‌లైన్ : రాజకీయ కారణాలతో రాష్ట్రాలను విడగొట్టడం తగదని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఒకవేళ విభజన జరిగితే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టులవుతాయని, అప్పుడు నీటికేటాయింపులు రాష్ట్రాల చేతుల్లో ఉండవని ఆయన పేర్కొన్నారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మితమైన ప్రాజెక్టులు నుంచి కేటాయింపులు ఉండవన్నారు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఒకవేళ విభజన అనివార్యమైతే మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను సీమాంధ్రలో కలిపి 16 జిల్లాలను ఓ రాష్ట్రంగా ఏర్పాటు చేసి 7 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు చే యాలన్నారు. అలాగే హైదరాబాద్‌పై అధ్యయనం చేసి ఇరుప్రాంతాలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం వైఎస్ వివేకా మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక గ్రామంలా కలిసిపోతున్నాయన్నారు. చాలా దేశాలు యునెటైడ్గా ఏర్పడి అభివృద్ధి చెందుతున్న తరుణంలో విభజన పేరుతో మనదేశాన్ని ముక్కలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాల కేటాయింపుల్లో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. అన్ని పార్టీల నేతలు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. పా ర్టీల నిర్ణయాలకంటే ప్రజాభీష్టమే ముఖ్యమని తెలిపారు. అన్ని పార్టీల నేతలు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. -
సీమాంధ్ర ఆందోళనలపై ప్రధాని స్పందించాలి
రాయలసీమ కార్మిక కర్షక సేవా సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి కడప, న్యూస్‌లైన్: సీమాంధ్రలోని 13జిల్లాల్లో 20 రోజులుగా మహోద్యమం జరుగుతుంటే ప్రధాని మన్మో హన్‌సింగ్ స్పందించకపోవడం దారుణమని రాయలసీమ కార్మిక కర్షక సేవా సమితి అద్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీహెచ్ మాట్లాడుతూ విభజన వల్ల సమస్యలు చాలా జఠిలమవుతాయన్నారు. తెలుగువారి ఐక్యతకు ఉన్న చారిత్రక నేపధ్యం తెలుసుకోకుండా మాట్లాడటం తెలంగాణ వాదులకు తగదని హితవు పలికారు. రాయలసీమ వాసులు ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును కర్నూలు రాజధానిని త్యాగం చేశారన్నారు. విభజన వల్ల మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, చిత్రావతి, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు ఒక్క చుక్కకూడా నీరు రాదన్నారు. ఫలితంగా రాయలసీమ, దక్షిణ తెలంగాణ, రాపూరు, నెల్లూరు ప్రాంతాలు శాశ్వత ఎడారిగా మారుతాయని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కరించబడాలంటే 18 జిల్లాలతో ఒక రాష్ట్రం, ఏడు జిల్లాలతో తెలంగాణ ఇవ్వడమే మార్గమన్నారు. కరువు ప్రాంతాల గోడుపై ఎక్కడా చర్చ జరగడం లేదని, పత్రికలు కూడా ఈ ప్రాంత ప్రజల ఆవేదనను ఎత్తిచూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 23 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాదును దేశంలోనే పేరుగాంచే విధంగా అభివృద్ది చేశారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పునరాలోచన చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. -
ప్రత్యక్ష పోరాటాల్లోకి ఆర్టీసీ కార్మికులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరుగుతున్న వివిధ పోరాటాల్లో ఆర్టీసీ కార్మికులు కూడా ప్రత్యక్షంగా పా ల్గొనాలని నిర్ణయించినట్లు ఎంప్లాయీస్ యూ నియన్ సమైక్యాంధ్ర పోరాట సమితి అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్జీఓ హోంలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి ఎన్జీఓల తో కలిసి ఆందోళనల్లో పాల్గొంటారని వెల్లడించారు. యాజమాన్య బెదిరింపులను లెక్క చేయకుండా రాయలసీమ, కోస్తాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన అన్ని కేటగిరిల కార్మికులు సమ్మెలోకి వచ్చారని తెలిపారు. మంగళవారం రాస్తారోకోలు, మానవహారాలు,వంటావార్పు లు నిర్వహించారన్నారు. విశ్రాంత ఆర్టీసీ కార్మికులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్.రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ జిల్లాలో 2300 మం ది గెజిటెడ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రం విభజన జరిగితే 58 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళుతుందన్నారు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో తీవ్రం గా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ర్ట ఆదాయంలో 65శాతం హైదరాబాద్‌తో కూడి న తెలంగాణా నుంచి వస్తుండగా సీమాంధ్ర నుంచి కేవలం 35శాతమే లభిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో విభజన అంటూ జరిగితే ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండదన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కెవి శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 35వేల మంది వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు సమ్మె చేపట్టారని తెలిపారు. మున్సిపల్ కార్మిక ఉద్యోగులు కూడా సమ్మెచేపట్టారని, అయితే తాగునీరు, శానిటేషన్, విద్యుత్ వంటి సమస్యలకు ఇబ్బంది కలగకుండా చూస్తారన్నారు. గతంలో పిఆర్సి వంటి తమ ఆర్థిక పరమైన డిమాండ్ల కోసం మాత్రమే ఆందోళనలు చేసిన తాము ఇప్పుడు రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమంలో పాల్గొంటున్నామన్నారు. సమ్మెలోకి వెళితే ఎస్మా ప్రయోగిస్తామంటూ ట్రెజరీ ఉద్యోగులకు బెదిరింపులు పంపడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి తక్షణం ఉద్యమంలోకి రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట సమితి కన్వీనర్ రాజేంద్రప్రసాద్, జోనల్ కార్యదర్శి జివి నరసయ్య, రీజనల్ ట్రెజరర్ నాగముని తదితరులు పాల్గొన్నారు. -
12న కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం: చంద్రశేఖర్‌రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై తమ నిర్ణయాన్ని సీడబ్య్లూసీ సమావేశంలో తీర్మానం చేసినా నాటినుంచి దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో సమైక్య జేవేసీ సమావేశమైంది. ఈ సమావేశంలో తమ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాన్ని ప్రకటించినట్టు జేఏసీ నాయకులు గౌరవ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం చేయనున్నట్టు చెప్పారు. 16వ తేదీన నియోజకవర్గాల కేంద్రాల్లో రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 18న కూడా కడప, రాజంపేటలలో రైల్‌రోకో, జైలు భరో వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు.