జూలైలో చైర్‌పర్సన్ల ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల చైర్‌పర్సన్ల ఎన్నికలను జూలై మొదటి వారంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయాత్తమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రత్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడై నెలన్నర రోజులు గడుస్తున్నా.. పరోక్ష పద్ధతిలో జరిగే చైర్‌పర్సన్ల ఎన్నికలు ఇంకా జరగలేదు. రాష్ర్ట విభజన చట్టంలో ఎన్నికల సంఘం ప్రస్తావన లేదు. దీంతో ఇంతకాలం సందిగ్ధంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. సోమవారం అంతర్గతంగా నిర్వహించనున్న సమావేశంలో చైర్‌పర్సన్‌ల ఎన్నికల తేదీపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత వచ్చినా రాకపోయినా.. ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. విభజన చట్టంలో ఎన్నికల సంఘాన్ని ఏ షెడ్యూల్‌లోనూ చేర్చకపోతే.. సహజంగానే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతుందన్న వాదన కూడా ఉంది. అలాంటి స్థితిలో సదరు సంఘం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే ఎన్నికల నోటిఫికేషన్ చెల్లుతుందా.. లేదా.. అన్న మీమాంస కారణంగా నోటిఫికేషన్ జారీ అంశం జాప్యమవుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు మార్చి 30వ తేదీన, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలను రెండు దశలుగా ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది.
ఇరు రాష్ట్రాల్లోనూ మొత్తం 145 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లు (ఇందులో తెలంగాణలో మూడు కార్పొరేషన్లు. 53 మున్సిపాలిటీలు), 1096 మండలాలకు గాను సీమాంధ్రలో 663 మండలాలకు, తెలంగాణలో443 మండలాలకుగాను 441 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. (ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు కేటాయించడాన్ని నిరసిస్తూ రెండు మండలాల్లో నామినేషన్లు ఎవరూ వేయకపోవడంతో ఎన్నికలు జరుగలేదు). మున్సిపల్ ఫలితాలు మే 12న, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మే 13న వెల్లడయ్యాయి. కొత్తగా ఎన్నికైన రెండు రాష్ట్రాల అసెం బ్లీల సభ్యులు, పార్లమెంట్‌లో ఎంపీలు ప్రమాణం చేసి, వారి నియోజకవర్గంలో ఉండే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటు వేయడానికి ఆప్షన్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కూడా చైర్‌పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు. మండల, జెడ్పీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కేవలం సభ్యులుగా వ్యవహరిస్తారు. పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరిగే సమయంలో ఓటు వేయడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి సోమవారం నిర్వహించనున్న సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నిర్వహణలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలను జూలై మొదటి వారంలో జరిపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
క్యాంపులను పట్టించుకోని ఎన్నికల సంఘం..
మండల, జిల్లా, మున్సిపల్, కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీ లేక తక్కువ స్థానాలున్న చోట ఇతర పార్టీల వారిని తమ వైపు తిప్పుకోవడానికి చేస్తున్న క్యాంపు రాజకీయాలపై ఎన్నికల సంఘం తప్ప మరే సంస్థ..చర్య తీసుకునే అవకాశం లేదు. కాని బాహాటంగా క్యాంపు కార్యక్రమాలు కొనసాగుతున్నా.. ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. ఎన్నికైన సభ్యులతో.. దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాలకు సైతం వెళ్తున్నారు. జాప్యం కారణంగా కొన్ని చోట్ల క్యాంపులకు విరామమిచ్చి, ఇప్పుడు తాజాగా అధ్యక్షుల ఎన్నికల ప్రకటన వస్తే తిరిగి క్యాంపులు నిర్వహించే యోచనతో ఉన్నారు. పారదర్శకంగా జరగాల్సిన ఈ ఎన్నికలు.. డబ్బు, సభ్యులను లోబర్చుకోవడం వంటి చర్యలతో గాడితప్పుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.