చల్లా రామకృష్ణారెడ్డి , మహమ్మద్ ఇక్బాల్
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు) : రేనాటిగడ్డగా పేరొందిన కోవెలకుంట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అరుదైన అవకాశం కల్పించారు. శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు యాధృచ్చికంగా కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు నేతలకు దక్కాయి. అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి, కోవెలకుంట్ల విద్యార్థిగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న రాయలసీమ రిటైర్డ్ ఐజీ, అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త మహమ్మద్ ఇక్బాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు.
ఇద్దరూ రేనాటిగడ్డ నేతలే
అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా రాజకీయ అరంగ్రేటం చేశారు. 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కోవెలకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొంది పదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. 2009 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోవెలకుంట్ల నియోజకవర్గం కనుమరుగై బనగానపల్లె నియోజకవర్గంగా మార్పు చెందటంతో ఆ ఎన్నికల్లో అప్పటి పీఆర్పీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చల్లా సేవలను పట్టించుకోకపోవడంతో 2019 ఎన్నికల సమయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాటసాని విజయం కోసం కృషి చేయాలని, అందుకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైఎస్ జగన్ చల్లాకు సూచించారు. ఇచ్చిన హామీ మేరకు చల్లాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
కోవెలకుంట్ల విద్యార్థి మహమ్మద్ ఇక్బాల్
2019 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ కోవెలకుంట్ల పూర్వ విద్యార్థి. ఇదే మండలంలోని కంపమల్ల ఇక్బాల్ తాతగారి ఊరు. మహమ్మద్ ఇక్బాల్ తాత మదార్‌సాహెబ్ 1965–70 మధ్యకాలంలో కోవెలకుంట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ మనవడైన మహమ్మద్ ఇక్బాల్‌ను తన వద్ద ఉంచుకుని పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. హైస్కూల్ విద్య బనగానపల్లె మండలం నందివర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి, ఉన్నత విద్య అనంతరం ఐపీఎస్‌గా కర్నూలు, కడప జిల్లాల్లో విశిష్ట సేవలందించారు. పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. తనకు విద్యనందించిన కోవెలకుంట్ల ప్రాంతంతో ఇక్బాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి దక్కనుండటంతో రేనాటిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment