మోపిదేవి, ఇక్బాల్, చల్లా
సాక్షి, అమరావతి: శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం విదితమే. ఈ స్థానాలకు రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పార్టీ మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. పార్టీ పరంగా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు సామాజిక వర్గాలకు శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు.
అందులో భాగంగానే మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార–బీసీ), మహ్మద్ ఇక్బాల్ (ముస్లిం–మైనార్టీ), చల్లా రామకృష్ణారెడ్డి (రెడ్డి)ని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ సామాజిక సమతౌల్యం పాటించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. శాసనసభ కోటా నుంచి ఎంపికైన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన ఫలితంగా ఖాళీ అయిన ఈ స్థానాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 14వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్ సీపీకి ఉన్న సంఖ్యాబలం రీత్యా ఈ మూడు ఖాళీలు ఆ పార్టీకే లభిస్తాయి. అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు వైఎస్సార్‌సీపీ నేతలు ఈ నెల 14వ తేదీన నామినేషన్లు వేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment