వరుస ఎన్నికలతో సతమతం
సెలవులు రద్దు చేసిన పోలీసు శాఖ
పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు ముమ్మరం
జిల్లాకు చేరుకోని అదనపు బలగాలు
ఇప్పటివరకు 40 మంది బైండోవర్
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :
మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు పోలీసులకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడే అవకాశం ఉంది. వరుస ఎన్నికలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేయనున్నాయి. మార్చి 30న మున్సిపల్, నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఇందుకోసం పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. పట్టణాల్లో కవాతు కూడా నిర్వహిస్తున్నాయి. పోలీసులు రహదారులపై వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.
సెలవులు రద్దుమున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలున్న వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్‌లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు 24 గంటలు విధుల్లో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. పోలీసులు అనారోగ్యంతో ఉన్నా విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. బంధువుల శుభకార్యాలకు వెళ్లకూడదని, ఇతర ఎలాంటి పనులు పెట్టుకోవద్దనిన ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లోని వాతావరణం తెలుసుకోవాలని, ఇందుకు ప్రత్యేక పరిశీలన చేయాలని ఆదేశాలు వచ్చాయి.
పటిష్ట బందోబస్తు
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లాలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పొలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడు నెలలు ప్రస్తుత సిబ్బందితోపాటు అదనంగా బలగాలు రానున్నాయి. పోలింగ్ బూత్‌లవారీగా సిబ్బంది ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఆర్‌పీఎఫ్, స్పెషల్ ప్లాటూన్‌లు, బాంబ్, డాగ్‌స్క్వాడ్ ప్రాంతాలవారీగా విభజించి తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేస్తున్నారు. పోలింగ్ బూత్‌లవారీగా భద్రతను ఏర్పాటు చేసి ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
అదనంగా రెండు వేల బలగాలు..
ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీసులు సరిపోదు. ఇప్పటికే పనిఒత్తిడిలో ఉన్న పోలీసులతోనే ఎన్నికల విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో మరో రెండు వేల మంది అదనపు బలగాలు అవరమున్నట్లు జిల్లా పోలీసు శాఖ గుర్తించింది. ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖకు ప్రతిపాదనలు పంపించారు. నేడో, రేపో పోలీసు బలగాలు జిల్లాకు చేరుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులతోపాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ వంటి ప్లాటూన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లయింగ్‌స్వ్కాడ్ బృందాలు గస్తీగా తిరగనున్నారు. ఈ ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నాయకుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బట్టి గన్‌మెన్ ఎంపిక ఉంటుంది. ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు రోజుల్లో 40 మందిని బైండోవర్ చేశారు. వీరితోపాటు సంఘ విద్రోహ శక్తులను గుర్తిస్తున్నారు. త్వరలో వీరిని కూడా అదుపులోకి తీసుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
మద్యం విక్రయాలపై నిఘా
జిల్లాలోని ఐఎంఎల్ డీపో నుంచి తెచ్చిన మద్యాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. పరిమిత సమయంలో వ్యాపారం చేయాలి. జిల్లాకు సంబంధం లేని మద్యం విక్రయాలు జరిపినా, రవాణా చేసిన చర్యలు తీసుకోనున్నారు. నాటుసారా విక్రయాలు, బెల్లంపట్టిక సరఫరా ప్రాంతాలపై నిఘా ఉంచనున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో దీని కోసం మూడు బృందాలు నిత్యం పరిశీలన చేసేందుకు ఏర్పాటు చేయనున్నారు.