చంద్రబాబూ అదే జైలుకు వెళతారు..
కాకినాడ: భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాల డీలర్లు ఇద్దరే ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఒకరు పాతూరి రామారావు, మరొకరు కేంద్రమంత్రి సుజనా చౌదరి అని... వాళ్లిద్దరు టీడీపీ నాయకులే అని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, అవునో కాదో చంద్రబాబు నాయుడు చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబును అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వేచి చూస్తోందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళతారని అన్నారు. తమను రాజకీయ దురుద్దేశంతో జైలుకు పంపిన చంద్రబాబు కూడా అదే జైలుకు వెళతారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.