=పుంగనూరు ప్రజల జయ జయ ధ్వానాలు
=జనసంద్రమైన పుంగనూరు పట్టణం
=పండుగ వాతావరణం కలుగజేసిన శంఖారావం సభ
సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావంలో భాగంగా సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి పుంగనూరులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ఆయన ప్రతి మాటకూ పుంగనూరువాసులు జయ జయ ధ్వానాలతో హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట అని చెప్పగానే ప్రజలు సైతం బాబుపట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.
పుంగనూరులోని బస్టాండ్ కూడలి వద్ద సమైక్య శంఖారావం సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఆయన ముందుగా, ఎన్ని పనులు ఉన్నా, ఎంత సేపైనా వేచి ఉన్న ప్రతి అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు.. అనగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. నాలుగున్నర సంవత్సరాలైనా మరణించిన మహానేతను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఉన్నారని, ఆయన ప్రజల గుండెల్లో ఇంకా జీవించి ఉన్నారని అనగానే ప్రజలు ‘‘వైఎస్‌ఆర్ అమర్ రహే’’ అని నినాదాలు చేశారు.
తన తండ్రి వైఎస్‌ఆర్ ఎన్నాళ్లు జీవించామనేది ముఖ్యం కాదని, ఎలా బతికామనేది ముఖ్యమని తనకు చెప్పారనగానే ‘‘అవును’’ అంటూ చేతులెత్తి మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన పేరుతో సభ నిర్వహించారని అయితే ఆయన ఆ సభలో సమైక్యం అన్నమాట అంటారని చాలా సేపు ఎదురుచూశానని అనగానే ‘‘చంద్రబాబు విభజన ద్రోహి’’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తూ, ఆయన కుమ్మక్కు అయ్యారని అన్నారు. కుమ్మక్కు అయితే మహానేత మరణించిన 18 నెలల్లోనే తనను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 30 వేల కోట్ల రూపాయల భారం మోపితే, తాము అవిశ్వాసం పెట్టామని, దీనికి మద్దతు ఇవ్వకుండా, ఓటింగ్‌లో పాల్గొనవద్దంటా వారి ఎమ్మెల్యేలకు విప్ జారీచేశారనగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. చంద్రబాబుకు నిజాలు మాట్లాడకూడదని మునిశాపం ఉందని అందుకే ఆయన ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడతారనగానే ప్రజలు జయ జయ ధ్వానాలు చేశారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని జననేత వ్యాఖ్యానించడాన్ని సమర్థిస్తూ నినాదాలు చేశారు. ఉచిత కరెంటు ఇస్తామని వైఎస్ అంటే, దానిపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు ఇప్పుడు అదే హామీని ఇస్తున్నారంటే నమ్మశక్యమా అని ప్రశ్నించారు.
దీనికి ప్రజలు ‘‘కాదు’’ అని సమాధానమిచ్చారు. 1975లో రెండు ఎకరాల ఆసామిగా రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ విస్తరించిన హెరిటేజ్ సంస్థలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గోల్ఫ్ కోర్టుకు 530 ఎకరాలు శనక్కాయలకు విక్రయించారనగానే, ప్రజల నుంచి నవ్వులు వినిపించాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎన్ జీకి 830 ఎకరాలు కట్టబెట్టినా సీబీఐ ప్రశ్నించలేదని చెప్పడంతో, ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. రాష్ట్రాన్ని విడగొడితే ఒప్పుకుంటారా అని ప్రశ్నించగా ‘‘వద్దు’’ అని సమాధానమిచ్చారు.
సోనియాగాంధీకి తెలుగురాదని, ఇంగ్లీషులో చెప్పమంటూ, వారిచే ‘‘నో’’ అనిపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మేల్యే అమరనాథరెడ్డి, ఆర్‌కే.రోజా, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్ తదితరులు ప్రసంగించారు.
చంద్రబాబుపై జగన్ నిప్పులు
Published Tue, Dec 31 2013 3:22 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement