ఏ నోట విన్నా సమైక్యమే
=విడిపోతే ఉద్యోగాలు లభిస్తాయా?
=ప్రజల గోడు పట్టించుకోని సీఎం, ప్రతిపక్ష నేతలు
=జగన్ ప్రసంగంపై వెల్లువెత్తిన హర్షధ్వానాలు
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో ఏ నోట విన్నా సమైక్యాంధ్ర నినాదమే వినిపిస్తోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో మూడోవిడత ఆయన చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర బుధవారం నాలుగవ రోజుకు చేరుకుంది. సోమల మండలం కందూరు నుంచి యాత్ర ప్రారంభించారు. సోమలలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించారు.
ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు నీరు ఎక్కడి నుంచి తీసుకు వస్తారని ప్రశ్నించారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్ర శ్నించారు. పంట పొలాలకు రైతులు నీటి కోసం ఎక్కడికి వెళ్లాలని అడిగారు. రాష్ర్టంలో ఏ నోట విన్నా జై సమైక్యాంధ్ర నినాదమేనని అనడంతో, అక్కడున్న వారు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు.
ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఇక్కడి వారి కష్టాలు పట్టకపోవడం శోచనీయమని అన్నారు. వీరికి ప్ర జలగోడు వినిపించదన్నారు. ఇందుకు ప్రజలు ‘అవును అవును’ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు అసెంబ్లీకి రాకుండా ఏసీ గదుల్లో కూర్చుని ఉన్నారని ఆరోపించారు.
చంద్రబాబునాయుడు తెలంగాణ వారు వస్తే ‘జై తెలంగాణ’ అంటూ, సీమాంధ్రులు వస్తే ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సొంత పార్టీకి చెందిన వారినే మభ్య పెడుతున్నారని అన్నారు. ఇందుకు కూడా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అసెంబ్లీలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి చేసిన డిమాండ్‌తో ఏకీభవిస్తూ హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా రాష్ట్రాన్ని విడగొట్టడానికి అసెంబ్లీ తీర్మానం పంపించాలని తరువాతే, కేంద్రం బిల్లును తీసుకు రావాలని అన్నారు. అయితే కేంద్రం రాష్ట్రాన్ని విడగొట్టాలి అని నిర్ణయం తీసుకుని బిల్లు పంపించిందని అన్నారు. దీనికి కిరణ్, చంద్రబాబు వంత పాడుతున్నారని అన్నారు.
ఈ గడ్డ మీదకు వస్తే చంద్రబాబును, కిరణ్ కుమార్‌ను కాలర్ పట్టుకుని అడగాలని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, కిరణ్‌లు అసెంబ్లీకి వచ్చి, సమైక్య తీర్మానం పెట్టాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ భాషరాదని, ఆమె మనదేశం కాకపోయినా, మన రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనగానే ‘‘సోనియా డౌన్ డౌన్’’ అని నినాదాలు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కు, ప్యాకేజీలు కోరుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని అన్నారు.
సోనియా గాంధీకి గుండెపోటు వచ్చేలా గట్టిగా అందరూ జై సమైక్యాంధ్ర అని అరవాలని ఆయన కోరగానే, అక్కడున్న వారందరూ రెండు చేతులు పెకైత్తి ‘‘జై సమైక్యాంధ్ర’’ నినాదాలు చేశారు. ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి, నగరి, పీలేరు, మదనపల్లి సమన్వయకర్తలు రోజా, చింతల రామచంద్రారెడ్డి, షమీమ్ అస్లాం, నాయకులు పోకల అశోక్‌కుమార్ పాల్గొన్నారు.