గడ్డిపెట్టినా.. బాబు తన బుద్ధి మార్చుకోలేదు: వైఎస్ జగన్
వెయ్యికోట్ల విద్యుత్ భారం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదివిన తర్వాత.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే తాము మళ్లీ సభకు వచ్చినట్లు ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాన్ని బయటకు పంపి ప్రజలపై భారం వేయాలని ప్రయత్నించారని, చంద్రబాబుకు గడ్డి పెట్టినా ఆయన తన పద్ధతి మార్చుకోలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు. చంద్రబాబు పుణ్యమాని ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పే అవకాశం కూడా ఇవ్వరని.. సభ నుంచి పది నిమిషాల ముందే వాకౌట్ చేశామని ఆయన అన్నారు.
ప్రభుత్వ సిగ్గులేని ధోరణిని చూసి మార్పు రాదని నిర్ధారించుకునే బయటకు వచ్చామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సభలో తానేం మాట్లాడినా ఆధారాలు ఉంటాయని, చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ విద్యుత్ ఒప్పందాల గురించి తాను గత బడ్జెట్ సమావేశాల్లోనే స్పష్టంగా చెప్పానన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా, రాజధాని లాంటి కీలకాంశాలు సభలో ఇప్పటివరకు చర్చకు రాలేదని, సమావేశాలు పూర్తయ్యేలోపు ఈ అంశాలపై గట్టిగా నిలదీస్తామని ఆయన చెప్పారు. కోట్లాది మంది ప్రజలు తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. త్వరలోనే పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతం వద్దకు కూడా వెళ్తామన్నారు.