హైదరాబాద్: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ దద్దరిల్లింది. దాంతో అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. మూడు సార్లు వాయిదాల అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. 'పోలవరానికి చంద్రగ్రహణం' అంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. తమ ప్రభుత్వంపై సాక్షి పత్రికలో అవాస్తవ కథనాల్ని ప్రచురిస్తోందని దీనిపై క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మరోవైపు వైఎస్ జగన్ ప్రసంగం ప్రారంభించగానే అధికార పక్షం అడుగడుగునా అవాంతరాలు సృష్టించింది. పట్టిసీమ ద్వారా పంపింగ్ చేసే నీటిని ఎక్కడ నిల్వ చేస్తారనే కీలకాంశాన్ని ఆయన లేవనెత్తారు. గోదావరి దాదాపు నాలుగుల నెలలు పొంగుతుందని చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ మాట్లాడుతున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు.. సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆవేశంగా ఊగిపోయారు. వీళ్లు మనుష్యులు కారంటూ విపక్ష సభ్యుల్ని ఉద్దేశించి అన్నారు. ఏం చేస్తారు, ఏం చేస్తారంటూ ఆవేశంగా ఊగిపోయారు. క్షమాపణకు ముఖ్యమంత్రి డిమాండ్ చేయడంతో మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిశోర్ బాబు రెచ్చిపోయారు.
వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు దిగారు. వైఎస్ జగన్‌కు మాట్లాడే అవకాశమివ్వాలని వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పొడియం చుట్టుముట్టారు. అయితే సభా నాయకుడిగా ముఖ్యమంత్రికి ప్రాముఖ్యం ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో సభలో గందరగోళం తీవ్రస్థాయికి చేరింది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో కోడెల సభను15 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సమావేశాలు ప్రారంభమైనా విపక్ష సభ్యుల నిరసనలతో సభ హోరెత్తింది. దాంతో స్పీకర్... సభను బుధవారానికి వాయిదా వేశారు.
వైఎస్ జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్న చంద్రబాబు
Published Tue, Mar 17 2015 1:31 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM
Advertisement