
హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం హైదరాబాద్ బయల్దేరారు. చంద్రబాబు అంతకుముందు విశాఖపట్నం జిల్లాలో పర్యటించి హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించారు. వరదలు, తుపానుల దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతంలో స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.
తుపాన్ వల్ల దెబ్బతిన్న గ్రామాలను చంద్రబాబు సందర్శించి బాధితులను పరామర్శించారు. విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించనందున కిరోసిన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తుపాన్ వల్ల దెబ్బతిన్న టేకు చెట్టుకు 500, కొబ్బరిచెట్టుకు 1000, జీడి మామిడి ఎకరాకు 25 వేలు, వరి ఎకరాకు 15 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. కొన్ని చోట్ల రోడ్డు షోలు నిర్వహించారు. బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.