
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయం సమీపిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సవాలక్ష జిమ్మిక్కులు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.10 వేల నగదును పసుపు కుంకుమ కింద ఇస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. జిల్లాలోని 67వేల సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలందరికీ ఒక్కసారిగా రూ.10 వేలు ఇవ్వాలంటే రూ.659 కోట్లు కావాలి. అదికూడా ఫిబ్రవరిలోనే ఇచ్చేస్తామన్నారు. ఇందులో ఓ మర్మముంది. ఓ తిరకాసుంది. మహిళల్ని ఏమార్చడమే ఇందులోని మర్మం. సంఘాల్లో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మహిళల్ని మోసగించడమే ఈ పథకంలోని తిరకాసు. అదెలాగంటే..
చిత్తూరు అర్బన్: గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో మహిళలకు హామీలిచ్చి తర్వాత విస్మరించింది. అప్పటి వరకు తీసుకున్న బ్యాంకు రుణాలు చెల్లించొద్దని మహిళా సంఘాలకు టీడీపీ చెప్పింది. మహిళలు ఈ మాటలు నమ్మి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలుచెల్లించలేదు. ఒకటి, రెండు, మూడు ఇలా ఆరు నెలలయ్యాయి. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై ఎలాంటి ప్రకటనా రాలేదు. తీసుకున్న రుణాలు చెల్లించకుంటే ఇళ్లవద్దకు వచ్చి పరువుతీస్తామంటూ బ్యాంకర్లు హెచ్చరికలు జారీ చేశారు. తీరా ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వెలువడింది. రుణమాఫీ చేయడం సాధ్యంకాదని, రూ.10 వేలను ప్రతి మహిళకూ ఇస్తానని చంద్రబాబు నాయుడు చల్లగా చెప్పారు. అది కూడా నాలుగు విడతలుగా విడుదల చేయడంతో ఆర్నెల్ల పాటు రుణం చెల్లించకుండా ఆపేసిన ప్రతి మహిళా సంఘానికి ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలు ఏ మూలకూ చాల్లేదు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మహిళా సంఘాలను బుజ్జ గించి మరోమారు మోసం చేయడానికి తాజాగా రెండో విడత పసుపు కుంకుమ పేరిట రూ.10 వేలు ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది.
అసలు విషయం ఇదీ..
ముఖ్యమంత్రి ఇప్పుడిస్తామంటున్న రూ.10 వేలను పోస్టుడేట్ చెక్కుల ద్వారా మహిళలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అంటే ఫిబ్రవరి 20వ తేదీన మహిళలకు చెక్కు ఇస్తే అందులో తేదీ మాత్రం ఏప్రిల్, మే నెలవి ఉంటాయి. అప్పటికప్పుడు ఈ చెక్కులను మార్చుకోవడం సాధ్యంకాదు. ఫిబ్రవరి నెలలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్‌లో రూ.4 వేలు చెల్లిస్తారట. ఇచ్చే ప్రతి చెక్యూ పోస్ట్‌డేట్‌లవే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మహిళలకు డబ్బులు ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం అంగీకరించదని భావించిన ముఖ్యమంత్రి ఈ కొత్త తరహా వ్యూహాన్ని రచించారు. ఎన్నికలు పూర్తయ్యి అధికారం చేజారిపోతే చెక్కులు చెల్లుబాటు అవుతాయో, లేదో కూడా తెలియని పరిస్థితి.
కొత్త సంఘాలకు లేనట్లే..
పసుపు కుంకుమ నిధులు తీసుకోవడానికి సోమవారం నుంచి మహిళా సంఘాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంది. దీనికి కొన్ని షరతులు వర్తింపచేయనున్నారు. ఈ పథకం అందుకునే మహిళ ఎన్నేళ్లుగా సంఘాల్లో ఉన్నారో వివరాలు ఇవ్వాలి. కొత్తగా ఏర్పాటయిన మహిళా సంఘాలకు దీన్ని అమలుచేయడం సాధ్యం కాదని అధికా రులు చెబుతున్నారు. చేస్తున్నదే మోసం, అందులోనూ అందరికీ వర్తించదనే ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు అగ్గిమీద గుగ్గిలమవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇచ్చేంత వరకు నమ్మకంలేదు..
ఐదేళ్ల ముందు బ్యాంకులో తీసుకున్న రుణం కట్టొద్దన్నారు. వీళ్ల మాటవిని నాలుగు నెలల రుణం కట్టలేదు. మళ్లీ సొమ్ములు (ఆభరణాలు) కుదువపెట్టి అప్పు తీర్చినాం. ఇప్పుడేమో పదివేలు ఇస్తామంటా ఉండారు. డబ్బు చేతికి వచ్చేదాకా మాకు నమ్మకంలేదు. – శాంతమ్మ, మండికృష్ణాపురం, గుడిపాల
Comments
Please login to add a commentAdd a comment