
సాక్షి, అమరావతి/విజయవాడ: వివాదాస్పదంగా ఉన్న ఆరు రకాల భూములకు సంబంధించిన సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 80 వేలకు పైగా ఉన్న చుక్కల భూముల కేసులు, 24 వేల ఈనాం భూముల కేసులు, లక్ష వరకు ఉన్న సొసైటీ భూముల కేసులతో పాటు ఇతర వివాదాస్పద భూములన్నింటినీ పరిశీలించి అవి ఎవరి పేరుపై ఉంటే వారికి పట్టాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి భూమికి 11 అంకెల విశిష్ట సంఖ్యను అందించే భూధార్ పోర్టల్‌ను ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చుక్కల భూములను నెల రోజుల్లోనే ఎవరి స్వాధీనంలో ఉన్నాయో చూసి వారికి యాజమాన్యపు పట్టాలిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ‘భూసేవ’ పేరుతో ప్రవేశపెడుతున్న ఈ ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా షేర్లు అమ్ముకున్నంత సులభంగా భూ క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని చెప్పారు. భూధార్ కార్యక్రమంలో కృష్ణా, అనంతపురం జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్‌ను సీఎం అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాద రహితంగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికల్లా రాష్ట్రవ్యాప్తంగా భూసేవ ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేస్తామని ఐటీ సలహాదారు, ఉడాయ్ ఛైర్మన్ జె సత్యనారాయణ తెలిపారు. రూ.30 నుంచి రూ.60 లోపు ఖర్చు పెట్టి ఇసేవా కేంద్రాలలో భూధార్ కార్డులను తీసుకోవచ్చన్నారు. సమావేశంలో సీసీఎల్‌ఏ మన్మోహన్ సింగ్, భూసేవ మిషన్ డైరెక్టర్ విజయ్ మోహన్ పాల్గొన్నారు. తొలుత ‘భూసేవ’ పోర్టల్, ఇ–భూధార్, మొబైల్ ఆధార్ కార్డులు, భూకమతాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సెక్యురిటీ పాలసీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. https:// bhuseva. ap. gov. in లింకు నుంచి వెళ్లి భూసేవ పోర్టల్ సేవలను అందుకోవచ్చని తెలిపారు. నజీమా అనే మహిళకు భూధార్ తొలికార్డును ముఖ్యమంత్రి అందించారు. ప్రాజెక్టులో భాగంగా భూముల వివరాలు శాటిలైట్ మ్యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నారు. భూసేవ ప్రాజెక్టు కోసం రూ.26.75 కోట్ల వ్యయం చేశారు. దీనికోసం రూపొందించిన ప్రత్యేక సాంకేతికత ‘కోర్స్’ కోసం రూ.32.50 కోట్ల ఖర్చయింది.
పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరగాలి
పట్టణాల్లోని ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్బన్ హౌసింగ్‌పై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించి ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ప్రతీ వారం ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్ష జరుపుతానని, ప్రతీ కుటుంబానికి అన్ని వసతులతో కూడిన ఇంటిని ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5 లక్షల ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారు? ఎన్ని ఇళ్లకు ప్రారంభోత్సవాలు జరిగాయి..? తదితర అంశాలను ఆన్ లైన్ లో ఉంచాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment