సాక్షి నెట్‌వర్క్: డ్వాక్రా మహిళలకు నాలుగున్నర ఏళ్లలో రూ.21,116 కోట్లు అందజేశామని, ఇంత చేశాం కాబట్టి తనకు అండగా నిలవాలని.. ఎన్నికలయ్యే వరకూ తన కోసం పనిచేయాలని సీఎం చంద్రబాబు వారిని వేడుకున్నారు. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానన్నారు. గ్రామాల్లో తన గురించి చర్చించాలని.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు. ‘నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత, నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే..’ అంటూ ఆయన మహిళలను అభ్యర్ధించారు. పసుపు–కుంకుమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు, కడప, విశాఖపట్నంలలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. డ్వాక్రా మహిళలకు మూడు దఫాల్లో రూ.10 వేలను అందజేయడమే కాకుండా, రాష్ట్రంలోని కోటి నలభై లక్షల మందికి స్మార్ట్‌ఫోన్లు అందజేస్తానని సీఎం ప్రకటించారు. ఫిబ్రవరిలో రూ.2,500.. మార్చిలో రూ.3,500, ఏప్రిల్‌లో రూ.4వేల చొప్పున చెక్కులను నేరుగా మహిళల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే టెక్నాలజీని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. రాష్ట్రంలో 93 లక్షల 80 వేల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని వీరందరికీ అప్పుచేసి మరీ రూ.10 వేలు చొప్పున ఇస్తున్నానని చెప్పారు. ‘సాక్షి’ పేపరోళ్లు చెబుతున్నట్లుగానే తన దగ్గర డబ్బుల్లేవని.. అందుకే రూ.10 వేలకు పోస్ట్ డేటెడ్ చెక్కులే ఇస్తున్నానని సీఎం చెప్పారు.
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
తానిచ్చే రూ.10 వేలతో డ్వాక్రా మహిళలు అంచలంచెలుగా రూ.లక్షలు సంపాదించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. నియోజకవర్గానికి 200 ఎకరాలు భూమి కేటాయించి అక్కడ మౌలిక సదుపాయాలు సమకూరుస్తానని.. వారు తయారుచేసిన వస్తువులు విక్రయించుకునేందుకు అక్కడ షెడ్లు నిర్మిస్తామని చెప్పారు. గతంలో కుటుంబ నియంత్రణకు తాను పిలుపునిస్తే మంచి స్పందన వచ్చిందని.. అలాగే, ఇప్పుడు ఒకరికి మించి పిల్లలను కనాలని కోరారు. కాగా, ఇప్పటివరకు 30 శాతం మేర వెలుగు సిబ్బందికి జీతాలు పెంచామని తెలిపారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తానని చంద్రబాబు అన్నారు. కాగా, ‘కేసీఆర్ నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. ఏ గిఫ్ట్ ఇస్తాడు.. ఆయన ఒక గిఫ్ట్ ఇస్తే ఆయనకు ఐదు రిటర్న్ గిప్ట్‌లు ఇవ్వడానికి మా అక్కాచెల్లమ్మలు సిద్ధంగా ఉన్నార’ని చెప్పారు. వైఎస్సార్‌సీపీ తామే గెలవబోతున్నట్టుగా డబ్బులిచ్చి సర్వేలు చేయించుకుందని, వాటిని నమ్మొద్దని చెప్పారు.
డ్వాక్రా మహిళలపై దాష్టీకం
ఇదిలా ఉంటే.. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లోని పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం (మెప్మా) ఆధ్వర్యంలో శుక్రవారం వెయ్యి మందికి పైగా మహిళల్ని సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామంటూ అంబేడ్కర్ భవన్‌కు బలవంతంగా రప్పించారు. అక్కడకు వెళ్లిన మహిళలకు అధికారులు చుక్కలు చూపించారు. కడపలో జరుగుతున్న సీఎం బహిరంగ సభను ఇక్కడ లైవ్‌లో చివరివరకు చూసిన వారికే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేస్తామంటూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బలవంతంగా కూర్చోపెట్టారు. కానీ, అది ప్రసారం కాలేదు. దీంతో మహిళలు తిట్టుకుంటూ బయటకు వచ్చారు. ఆగ్రహించిన అధికారులు గేట్లు మూయించేశారు. కొందరిని జుట్టుపట్టుకుని లాగుతూ లోపలికి తోసేశారు. ఇదే విధంగా రాజధాని ప్రాంతంలోని నేలపాడులోనూ అధికారులు, టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలను తీవ్ర ఇక్కట్లకు గురిచేశారు. ఇక్కడకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి మహిళలను తరలించారు. వీరిని గురువారం రాత్రే వారివారి మండల కేంద్రాల్లో ఉన్న వెలుగు కార్యాలయాలకు తీసుకువచ్చి అక్కడ నుంచి శుక్రవారం సభకు తీసుకువచ్చారు. రాత్రివేళ వీరికి భద్రత లేకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సభకు హాజరుకాకుంటే రూ.10 వేలు డబ్బు, స్మార్ట్‌ఫోన్‌లు అందవనే హెచ్చరికతో మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు సక్రమంగా చేయలేదు.
బలవంతంగా తీర్మానాలు..మహిళల మండిపాటు
‘మీతోనే మేముంటాం..’ అంటూ ఓ తీర్మాన పత్రాన్ని పంపాలంటూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మెప్మా శాఖ అధికారుల ద్వారా సమాచారం పంపడంపై డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి.. మాట తప్పి సంఘాలను నిర్వీర్యం చేసిన ఆయనకు తాము అండగా ఉన్నామని ఎలా తీర్మానాలు చేయాలంటూ వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో రీసోర్స్ పర్సన్లను (ఆర్పీలు) నిలదీశారు. ఈ సమావేశానికి డ్వాక్రా మహిళలను తీసుకురావాలంటూ సర్కారు ఆర్పీలను ఆదేశించడంతో వారు మహిళలను బెదిరించి బస్సులెక్కించారు. బస్సుల్లో ఉన్న ఆర్పీ సంఘ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోను, బస్సు ముందు సీఓ, ఆర్పీ నిలబడి సమాఖ్య ఫ్లెక్సీతో తీసుకున్న ఫొటోలను పంపించాలని నిబంధన పెట్టడంతో వారంతా సీఎం సభకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వందలాది బస్సుల్లో తరలించారు. కడపలో సీఎం సభ ప్రత్యక్ష ప్రసారానికి టీవీలను ఆర్పీలే ఏర్పాటుచేసుకోవాలనడంతో వారు లబోదిబోమంటూ పరుగులు పెట్టారు. మరోవైపు.. అమరావతి, విశాఖపట్నం, కడపలో జరిగిన సభల్లో మహిళలతో బలవంతంగా ఏకగ్రీవ తీర్మానం చేయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment