మాటలే.. చేతల్లేవు
- ప్రకటనకే పరిమితమైన రుణమాఫీ
- రికవరీ విషయంలో బ్యాంకుల దూకుడు
- గడిచిపోతున్న ఖరీఫ్ సీజన్
- పొదుపు మహిళలకూ జరగని న్యాయం
- ఖాతాల్లోని సొమ్ము బ్యాంకుపరం
మాటలు కోటలు దాటుతున్నా.. చేతల్లో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రమాణ స్వీకారం సాక్షిగా రుణ మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత ప్రకటన.. ఇప్పటికీ ఆచరణ సాధ్యం కాలేకపోయింది. కోటయ్య కమిటీ నివేదిక అనంతరం హడావుడిగా రుణాలు మాఫీ చేస్తామనే ప్రకటనే తప్పిస్తే.. ఇప్పటికీ ఆ విషయంలో స్పష్టత లేకపోవడం రైతులను గందరగోళానికి గురి చేస్తోంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండటంతో ఖరీఫ్ పుణ్యకాలం గడిచిపోతోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రెండు పర్యాయాలు ప్రతిపక్షానికే పరిమితమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టారు. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చినా.. రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై రోజుకో మాటతో మోసగించే ప్రయత్నానికి తెర తీశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నాయే కానీ.. ఆ హామీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాని పరిస్థితి. రుణాలు మాఫీ కాక.. రీషెడ్యూల్‌కు నోచుకోక.. కొత్త రుణాలు అందక ఖరీఫ్ సీజన్‌లో రైతులు దిక్కులు చూస్తున్నారు. రైతుల్లో ఇంటికి రూ.1.50 లక్షలు.. డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తానంటూ మెలిక పెట్టారు.
సరే.. దాంతోనైనా సంతృప్తి పడదామంటే అదీ లేకపోయింది. బాబు ప్రకటనతో తమ్ముళ్లు సంబరాలు చేసుకోగా.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని భావించిన రైతాంగం, పొదుపు మహిళల ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఎంతో ఆశతో బ్యాంకుల వద్దకు వెళితే.. రికవరీపై అధికారులు భీష్మిస్తున్నారు. అప్పటి వరకు కొత్త రుణాలు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలివ్వకపోవడంతో జిల్లాలో బ్యాంకర్లు రైతులు, డ్వాక్రా మహిళలకు నోటీసులు జారీ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాలోని పొదుపు డబ్బు, రైతుల వ్యక్తిగత ఖాతాలోని నగదును బ్యాంకర్లు అప్పుకు జమ కడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ తీరుపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి.
రుణాలు చెల్లించాల్సిందే: శ్రీనివాసులు, ఐకేపీ ఏపీఎం, బనగానపల్లె
బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వెంటనే చెల్లించాలని పొదుపు మహిళలను కోరుతున్నాం. మాకు పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. గత ఐదు నెలలుగా పెండింగ్‌లోని రుణాలను వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తే ఆ మొత్తం పొదుపు ఖాతాలో జమ అవుతుంది. చెల్లింపుల్లో జాప్యం జరిగితే వడ్డీ భారం తప్పదు.
బనగానపల్లె మండలం జొలాపురం గ్రామానికి చెందిన రబ్రీదేవి పొదుపుగ్రూపు సభ్యులు గత ఏడాది ఆంధ్రా బ్యాంకులో రూ.3 లక్షల రుణం తీసుకున్నారు. రూ.75 వేలు తిరిగి చెల్లించారు. ఈలోగా ఎన్నికలు రావడం.. ప్రచారంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాననడంతో బకాయిల చెల్లింపును నిలిపివేశారు. ఇప్పుడేమో సభ్యులకు తెలియకుండానే పొదుపు ఖాతాలోని రూ.16 వేలను బ్యాంకు అధికారులు డ్రా చేసుకుని ఏప్రిల్ నెల బకాయిలో జమ చేసుకున్నారు.
అవుకు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఆవుల ఈశ్వరరెడ్డికి 22 ఎకరాల మెట్ట పొలం ఉంది. జొన్న, పప్పుశనగ తదితర పంటలు సాగు చేస్తున్నాడు. 2011లో పెట్టుబడులకు స్థానిక స్టేట్ బ్యాంకులో రూ.40 వేల క్రాప్ లోన్ తీసుకున్నాడు. 2012లో బంగారం తాకట్టు పెట్టి ఇదే బ్యాంకులో రూ.70 వేల అప్పు పొందాడు. బ్యాంకులో వ్యక్తిగత ఖాతా(30737144817) ఉండటంతో ఇంటి అవసరాలకు రూ.50 వేల నగదు దాచుకున్నాడు. ఇటీవల డ్రా చేసుకునేందుకు వెళ్లగా బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించే వరకు వీల్లేదని చెప్పడంతో కంగుతిన్నాడు.