
ఏపీలో అవకాశాలు సద్వినియోగం చేసుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రముఖ ఎలక్ట్రానిక్స్
అమెరికా పర్యటనలో సీఎం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ సంస్థ ఫ్లెక్స్‌ట్రానిక్స్‌కు సూచించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు తొలిరోజు ఫ్లెక్స్‌ట్రానిక్స్ సీఈఓ మైక్ మెక్‌నమరతో సమావేశమయ్యారు. విశాఖలో ఇప్పటికే తమ ఉనికి ఉందని, సీఎం ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మైక్ తెలిపారు. అనంతరం చంద్రబాబు బృందం శాన్‌జోస్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శాక్రమెంటో విమానాశ్రయంలో దిగి కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ జెర్రీ బ్రౌన్ అధికారిక నివాసానికి వెళ్లారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో తమ రాష్ట్రానికి కాలిఫోర్నియా సహకారాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సెమీ కండక్టర్ ఇంటెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) సప్లయర్ ఏఆర్‌ఎం హోల్డింగ్స్ సీఈఓ సైమన్ అంథోనీ సెగర్స్, గూగుల్ వైఎస్ ప్రెసిడెంట్ టామ్ మూర్, టెస్లా సీఎఫ్‌ఓ దీపక్ ఆహుజాతోనూ సమావేశమయ్యారు.
మోసెర్ అసోసియేట్స్‌తో
రెండో రోజు పర్యటనలో ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకెర్ బాబు సమావేశమయ్యారు. అమరావతిలో నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరగా పరిశీలిస్తామని రస్సెల్ హామీ ఇచ్చారు. అనంతరం ఐటీ కంపెనీ జోహూ సీఈఓ శ్రీధర్ వెంబుతో సీఎం సమావేశమయ్యారు. ఆ తర్వాత చైనా కార్ల కంపెనీకి సీఈఓగా ఉన్న పద్మశ్రీ వారియర్‌తో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు బృందం గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించింది. తమ కార్యకలాపాలపై గూగుల్ ఎక్స్ సీఈఓ అస్ట్రో టెల్లర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగాజీఎస్‌ఎల్వీఎఫ్–09 ప్రయోగం విజయవంతం కావడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.