ఎక్కువమంది పిల్లల్ని కనండి | Chandrababu controversial comments in the Teacher Day Meet | Sakshi
Sakshi News home page

ఎక్కువమంది పిల్లల్ని కనండి

Published Wed, Sep 6 2017 1:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:30 PM

ఎక్కువమంది పిల్లల్ని కనండి - Sakshi

ఎక్కువమంది పిల్లల్ని కనండి

- ఉపాధ్యాయ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు
చదువుకున్న వారే పిల్లల్ని వద్దనుకుంటున్నారు
 
సాక్షి, అమరావతి: బాగా చదువుకున్న వారు పిల్లలను వద్దనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పిల్లల్ని కనడానికి చాలా మంది ఇష్టపడడం లేదని, కనడం, వారిని పెంచడాన్ని శ్రమగా భావిస్తున్నారని చెప్పారు. ఈ విధానం సరైంది కాదని, ఎక్కువ మంది పిల్లల్ని కనాలని లేకుంటే రోబోలతో పనిచేయించుకోవాల్సి వస్తుందన్నారు. విజయవాడలోని ఒక ఫంక్షన్‌ హాల్లో మంగళవారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, ప్రతి పాఠశాలలో తరగతి గదిని వర్చ్యువల్‌ రూమ్‌గా మారుస్తామని, అత్యుత్తమ విజ్ఞానాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో ఉండే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సర్వేపల్లి అసాధారణంగా ఎదిగారని, అత్యున్నత పదవులు చేపట్టి స్పూర్తినిచ్చారని తొలుత నివాళులర్పించారు. ఈ సభలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 131 మందిని సత్కరించి మెమోంటో, రూ.20 వేలు, ట్యాబ్‌ అందించారు. 
 
ఆదాయం వస్తుందనుకునే హామీలిచ్చాం
టీడీపీ మేనిఫెస్టోలోని హామీలన్నీ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఇచ్చినవని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువగా వస్తోందనే అన్ని హామీలిచ్చినట్లు తెలిపారు. విజయవాడలోని ఓ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరగడంతో ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోలేమన్నారు. పనులు చేసేది ఎన్నికల్లో గెలిచేందుకేనని, ఓడిపోతే చేసిన పనులన్నీ వ్యతిరేకంగా మారతాయని చెప్పారు.

ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో నంద్యాల, కాకినాడ మోడల్‌ను అనుసరిద్దామని.. ఎక్కడికక్కడ పబ్లిక్, పొలిటికల్, పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలని సూచించారు. 2019 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్నామని దానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలతో ఓట్లు వేయించుకునేలా పనిచేయాలని, దైవాధీనంగా వదిలేస్తే కుదరదన్నారు. కాకినాడలో ప్రతిపక్షం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవ్వాలని కోరుకున్నానని కానీ పది సీట్లు వచ్చాయన్నారు. పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ అత్యంత కీలకమని, దాని కోసమే వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు పనితీరు మార్చుకోవాలని, పాపులారిటీని పెంచుకోవాలని సూచించారు. ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవాలని, చేసిన పనులను చెప్పడంతోపాటు వారి గురించి ప్రజలకు వివరించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement