చంద్రబాబు పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు రెండు పూటలా సంతృప్తిగా భోజనం చేయలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.
అమలాపురం టౌన్:చంద్రబాబు పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు రెండు పూటలా సంతృప్తిగా భోజనం చేయలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉల్లి పాయల రేటు అందుబాటులో లేకుండా పోవడంపై ఆ పార్టీ అమలాపురం నియోజకవర్గ శ్రేణులు గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హైస్కూలు సెంటర్లోని మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు ఉల్లి దండలు మెడలో వేసుకుని, రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. అధిక ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విశ్వరూప్, చిట్టబ్బాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లి పాయలు సరఫరా చేస్తూ రూ.50 కోట్ల భారాన్ని భరిస్తున్నట్టు చెబుతున్న మాటలు బూటకమని ఆరోపించారు.
ఉల్లిని అరకొరగా రైతుబజార్లకు సరఫరా చేస్తున్నా అందులో కొంత బ్లాక్ మార్కెట్‌కు తరలించి అక్రమార్కులు సొమ్ములు చేసుకుంటున్నారన్నారు. కూరగాయల ధరలనే కాక పప్పుల ధరల్ని కూడా ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ధ్వజమెత్తారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మోకా వీరరాఘవులు, రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శులు గనిశెట్టి రమణలాల్, సుంకర సుధ, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మట్టపర్తి నాగేంద్ర, ఉండ్రు వెంకటేశ్, రూరల్ మండల కార్యదర్శి సూదా గణపతి, పట్టణ పార్టీ మహిళాధ్యక్షురాలు కొల్లాటి దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు.