తమ్ముళ్లకు బుజ్జగింపులు
టీటీడీపీ ఎమ్మెల్యేలతో బాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ‘తమ్ముళ్లు’ అధికార పార్టీలోకి జారుకుంటున్నారన్న ప్రచారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. రాష్ర్టంలోని పార్టీ ఎమ్మెల్యేలు వలస బాట పట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్ బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న ఎత్తులతో తెలంగాణలో తెలుగుదేశం ఖాళీ అయ్యే పరిస్థితి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ఎల్. రమణతో కలసి మంగళవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు. గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతున్న నేతలను ప్రత్యేకంగా బుజ్జగించారు. ఎమ్మెల్యేలందరితో విడివిడిగా కూడా సమావేశమయ్యారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఈ భేటీకి రాకపోవడం గమనార్హం. మూడు నెలలుగా ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ మెట్లెక్కని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను బాబే స్వయంగా ఫోన్ చేసి పిలవాల్సి వచ్చింది. తాజాగా చోటుచేసుకున్న మెట్రో రైలు వివాదంతో పార్టీలో లుకలుకలు బయటపడిన సంగతి తెలిసిందే. పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి వెళతారన్న ప్రచారం నేపథ్యంలో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తొలుత పార్టీ ఎమ్మెల్యేలనందరిని ఉద్దేశించి మాట్లాడిన బాబు తర్వాత ముఖాముఖి చర్చలు జరిపారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(ఇబ్రహీంపట్నం), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), రాజేందర్ రెడ్డి( నారాయణపేట) మాత్రం గైర్హాజరయ్యారు. ఇక తాను బీసీ ఉద్యమాలకే అధిక సమయం కేటాయిస్తున్న సంగతి వివరించిన ఆర్. కృష్ణయ్య పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు.
పార్టీని వీడొద్దని హితవు
తెలుగుదేశం పార్టీని అస్థిర పరచాలని చూస్తున్న టీఆర్‌ఎస్ కుట్రలకు బలికావద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా బలం పెంచుకోవాలని ఆ పార్టీ చూస్తోందని చెప్పారు. అధికారం అడ్డుపెట్టుకొని బెదిరింపులు, ప్రలోభాల ద్వారా చేర్చుకున్న ఎమ్మెల్యేలకు అక్కడ ఎలాంటి ప్రాధాన్యం ఉండదన్నారు. విభేదాలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు. పార్టీని కిందిస్థాయిలో పునరుత్తేజం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు భుజాన వేసుకోవాలన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై ప్రజల్లోకి వెళ్లి ఆందోళనలు చేయాలన్నారు. ఏ చిన్న అంశం దొరికినా వినియోగించుకోవాలని, అవినీతి, అక్రమాలు, భూ కేటాయింపులను ఎండగట్టాలని సూచించారు. దాదాపు గంటన్నర సేపు ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. తర్వాత విడివిడిగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఈ మంతనాలు సాగాయి.
ఎర్రబెల్లికి బుజ్జగింపులు
టీడీ ఎల్‌పీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి కాబోతున్నారని ప్రచారం జరగడంతో బాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మెట్రో వివాదం పార్టీకి కలసి వచ్చేదే కాబట్టి రేవంత్‌రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చానని, అంతేకాని మరొకరిని దూరం చేసుకోవాలని కాదని ఎర్రబెల్లిని సముదాయించినట్టు తెలిసింది. పార్టీ మారడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని, టీడీపీలో ఉన్న స్వేచ్ఛ మరెక్కడా ఉండదని వివరించారు. భవిష్యత్‌లో ‘దేశం’ బలపడుతుందని, మరిన్ని అవకాశాలు వస్తాయని సముదాయించారు. అయితే రేవంత్ ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని, వెలమ సామాజిక వర్గాన్ని ‘దొరలు’ అనే పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఇబ్బందిగా మారిందని చంద్రబాబుకు ఎర్రబెల్లి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను కేసీఆర్‌ను కలసిన మాట వాస్తవమేనని, అయితే పార్టీ మారే విషయం గురించి కాదని వివరించారు. కాగా, రేవంత్‌రెడ్డితో బాబు మాట్లాడినప్పుడు మెట్రో వివాదంలో వ్యవహరించిన తీరును ప్రశంసించినట్టు సమాచారం. మెట్రోరైలు వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, త్వరలోనే మరిన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని రేవంత్ తనను కలిసిన విలేకరులకు తెలిపారు.
మంత్రులే మా ఇళ్లకు వస్తున్నారు...
తమ పార్టీలోకి రావాలంటూ ఏకంగా మంత్రులే తమ ఇళ్లకు వస్తున్నారని, టీఆర్‌ఎస్‌లో చేరకుంటే నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా రావని, కేసులు పెట్టి జైళ్లలో పెట్టే పరిస్థితి ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. భూ కబ్జాలు, ఆస్తులకు సంబంధించిన కేసుల గురించి భయపెడుతున్నారని గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు తమ అధినేతకు ఏకరవుపెట్టినట్లు తెలిసింది. పార్టీలో చేరితే అనర్హత వేటు పడకుండా చూస్తామని కూడా టీఆర్‌ఎస్ నేతలు హామీ ఇస్తున్నట్లు బాబు దృష్టికి తెచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకుల ప్రలోభాలు, బెదిరింపుల వల్ల ఏమీ జరగదని, ఎవరూ పార్టీని వీడిపోవద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ధైర్యం నూరిపోశారు.