మంత్రివర్గంలో ఆ ఎమ్మెల్యేలకు చోటిస్తారా!
►మంత్రివర్గంలో బెర్త్ కోసం ఎమ్మెల్యేల యత్నాలు
► వైఎస్ జగన్‌పై చేస్తున్న అర్థంపర్థం లేని విమర్శలకు ఫలితం ఉంటుందా?
► ఆశల పల్లకిలో కాపు ఎమ్మెల్యేలు
► చంద్రబాబు దృష్టిలో పడేందుకు చీప్ ట్రిక్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :అధినేత దృష్టిలో పడాలంటే ఏం చేయాలి... ప్రజాప్రతినిధిగా సమర్థవంతంగా పనిచేయాలి. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలి. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి. నిత్యం జనాలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. పార్టీ శ్రేణుల కష్టాలను పట్టించుకోవాలి. కానీ.. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు దృష్టిలో పడాలంటే మాత్రం ఇవేమీ చేయనవసరం లేదు.
ఒకే ఒక్క పనిచేస్తే చాలు. ఆ పనే నోరు పారేసుకోవడం. రాష్ట్రంలో ప్రజాకర్షణ గల నేత, నిత్యం జన సమస్యలపై మడమతిప్పని పోరాటం చేసే ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అకారణంగా తిట్టిపోయాలి. అర్థంపర్థం లేని మాటలతో దుమ్మెత్తిపోయాలి. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరపు అచ్చెన్నాయుడు మొదలుకుని రాష్ట్రంలో చాలామంది టీడీపీ ప్రజాప్రతినిధులు ఎప్పుడూ అదేపనిలో ఉంటారు. ఇప్పుడు ఆ పనిని మన జిల్లాలోని కాపు ఎమ్మెల్యేలు తీసుకున్నారు.
ఆ నలుగురిలో ఎవరికైనా వస్తుందా?
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష దరిమిలా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మరో కాపు ఎమ్మెల్యేకు స్థానం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే అదనుగా మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని కాపు ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ పదవి కూడా కృష్ణా, గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక ఎమ్మెల్యేకి దక్కుతుందని ప్రచారం సాగుతుండటంతో ఆ సామాజికవర్గ ప్రజాప్రతినిధులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి పార్టీ విధేయుడుగా ముద్రపడ్డ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను పక్కనపెట్టే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వైపే అధిష్టానం చూసే అవకాశం ఉంది. దీంతో కృష్ణా జిల్లా నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమమాహేశ్వరరావు మంత్రి పదవిపై ఆశతో అదే పనిగా జననేతపై కువిమర్శలకు దిగుతున్నారు. మన జిల్లా విషయానికి వస్తే ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా!
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు దగ్గరి బంధువు కావడంతో వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ట్రాక్ రికార్డు ఉన్నా ఆయన పేరును పరిశీలించే అవకాశం లేదని అంటున్నారు. ఇక మిగిలిన ముగ్గురూ అదృష్టం తలుపుతట్టకపోదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు కంటే చినబాబు లోకేష్ కోటరీలో ఉన్న పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఈ విషయంలో మిగిలిన వారికంటే అడ్వాన్స్‌గా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మాధవనాయుడు, బుజ్జి కూడా అదేపనిగా ప్రతిపక్ష నేతపై దిగజారుడు విమర్శలకు దిగితే ‘బాబు’ల దృష్టిలో పడతామని భావించి ఇటీవల నోరు పారేసుకుంటున్నారన్న వాదనలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
మామూలుగానే ఎన్నో వర్గ లెక్కలు, కూడికలు, తీసివేతలతో రాజకీయాలు నెరిపే చంద్రబాబు బీజేపీ తరఫున ఉన్న కాపు వర్గానికే చెందిన పైడికొండల మాణిక్యాలరావును పక్కనపెట్టి టీడీపీ కాపులకు పట్టం కడతారా.. ఒకవేళ ఇచ్చినా చిల్లర చేష్టలతో నవ్వుల పాలవుతున్న నేతలనే దగ్గరకు తీస్తారా అనేది చూడాలి. తీరా ఏ పదవీ ఇవ్వకుంటే వ్రతం చెడ్డా ఫలితం దక్కక అటు ప్రజల్లోనూ ఇటు పార్టీ శ్రేణుల్లోనూ సదరు ఎమ్మెల్యేలు మరింత పలచన కావడం ఖాయం అన్న వాదనలు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్నాయి.