
కేబినెట్‌లో చోటు ఎవరికో!
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : చంద్రబాబునాయుడు కేబినెట్‌లో జిల్లా నుంచి ఏ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందోననే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తుండగా, వీరిలో ఇద్దరికి మాత్రమే పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ఇప్పటికే చంద్రబాబు సుముఖత వ్యక్తంచేసినట్టు తెలిసింది. జిల్లా నుంచి సుజాతను ఎంపిక చేస్తే మరొకరికి మాత్రమే అవకాశం ఉంది. పోలవరం ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన మొడియం శ్రీనివాసరావుకు మంత్రి పదవి లభించవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో 13 జిల్లాల్లో ఆపార్టీ తరుపున ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఈయన కాక పార్టీ సీనియర్ నాయకుడు బూరుగుపల్లి శేషారావు లేదా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కుగాని క్యాబినేట్‌లో చోటు దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు.
అయితే టీడీపీతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి కూడా తన కేబినేట్‌లో అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ జిల్లా నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పి.మాణిక్యాలరావు లేక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు దక్కుతుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే రేసులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురితో మొడియం శ్రీనివాసరావు పోటీ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకు రెండు కేబినేట్ దక్కనున్నాయన్న సమాచారంతో ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు కేబినేట్‌లో ఒకొక్క మంత్రికి రెండు శాఖలు కేటాయించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ రెండు శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావచ్చని అంటున్నారు. ఈ నేపధ్యంలో గతంలో ఎమ్మెల్యే అనుభవంతో పాటు, మహిళా ఎమ్మెల్యేగా పీతల సుజాతకే క్యాబినేట్‌లో ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. అలాకాకుండా గిరిజన సంక్షేమ శాఖ స్వయంగా పరిపాలన సాగించాల్సి వస్తే మొడియం శ్రీనివాస్‌కు మంత్రి పదవి లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని మాత్రం 12వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో కసరత్తు చేసేందుకే వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.