రైతుల పాలిట...భయంకరులు | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

రైతుల పాలిట...భయంకరులు

Published Thu, Jul 10 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

రైతుల పాలిట...భయంకరులు

రైతుల పాలిట...భయంకరులు

 వ్యవసాయ మదుపుల కోసం బంగారు ఆభరణాలపై ఆంధ్రా బ్యాంక్‌లో రుణం తీసుకున్నాను. రుణమాఫీ వస్తుందని ప్రకటించడంతో నాకు వర్తిస్తుందని ఆశతో ఉన్నాను. మదుపుల కోసం బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకొని అవసరాలకు తీసుకున్నాను. రుణం కట్టలేదన్న సాకుతో నాకిచ్చే ఖాతాను స్తంభింపచేశారు. ఏటీఎం నిలుపుదలచెయ్యడంతో డబ్బులు తీయడానికి వీలులేకపోయింది.   
 
 -చొక్కాపు తిరుపతిరావు, రైతు, అప్పయ్యపేట, సీతానగరం
 అన్నదాతలను బ్యాంకర్లు బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తున్నారు. వారి ఖాతాలను స్తంభింపజేసి ఉన్న కొద్దిపాటి సొమ్మును వ్యవసాయ పెట్టుబడులకు అందకుండా చేస్తున్నారు. ఖరీఫ్ రుణాలు ఇవ్వవలసిన సమయంలో బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులొస్తుండడంతో రైతులు కలవరపడుతున్నారు. గత ఏడాది పంటలు పండక, ఈ ఏడాది మదుపు లేక సతమతమవుతున్న పరిస్థితుల్లో నోటీసులిస్తూ బ్యాంకర్లు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఏటీఎం లావాదేవీలను కూడా నిలిపేస్తున్నారు. బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికైతే ఆభరణాలు వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం:  రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ఊరూవాడా ఊదరగొట్టి, రైతులెవ్వరూ బకాయిలు చెల్లించవద్దని గొప్పగా పిలుపు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించడంతో అన్నదాతలు అలో లక్ష్మణా అంటున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు రుణాల రీషెడ్యూల్ చేస్తామని చెబుతుండడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరో వైపు బ్యాంకర్లు తమ పనితాము చేసుకుపోతున్నారు. బకాయిలు చెల్లించని సీతానగరం మండలంలో రైతులకు చెందిన  సేవింగ్స్ ఖాతాలను, ఏటీఎం లావాదేవీలను ఆంధ్రా బ్యాంకు, ఎస్‌బీఐ, గ్రామీణ వికాస్ బ్యాంకులు బ్లాక్ చేశాయి. బంగారంపై రుణాలు తీసుకున్నవారికికైతే ఆభరణాలు వేలం వేస్తామని నోటీసులు జారీ చేస్తున్నాయి.  
 
  జిల్లాలోని 150 జాతీయ, 70 గ్రామీణ బ్యాంకుల ద్వారా  2. 67 లక్షల మంది రైతులు రూ.1,692 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్షా 82 వేల మంది రైతులు రూ.763 కోట్ల రుణాలను  నేరుగా తీసుకోగా, 55 వేల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.628 కోట్ల రుణాలు తీసుకున్నారు. మరో 30 వేల మంది రైతులు వ్యవసాయ యంత్రాలు, సామగ్రి ఇతరత్రా అవసరాల కింద రూ.301 కోట్ల టెర్మ్ రుణాలు తీసుకున్నారు. రుణమాఫీపై చంద్రబాబు అనుసరిస్తున్న తీరుతో వీరంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులతో భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టీడీపీ మంత్రులు ప్రస్తావిస్తున్న రుణాల రీషెడ్యూల్ అంశంతో నిరాశ నిస్పృహకు గురవుతున్నారు.  ఎప్పటికైనా బకాయిలను తామే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు.  

 పొదుపుఖాతాల నుంచి బకాయిలు డ్రా...
 జిల్లాలో రూ.391.06 కోట్ల మేర డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు రుణాలిచ్చాయి. రుణ మాఫీ ప్రకటనతో డ్వాక్రా సంఘాలు దాదాపు వాయిదాల చెల్లింపులు నిలిపేశాయి. లావాదేవీలు స్తంభించిపోవడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. బకాయిలు కట్టి తీరాల్సిందేనని గట్టిగా ఒత్తిడి చేస్తున్నాయి. కొన్నిచోట్లయితే పొదుపు ఖాతాల నుంచి బ్యాంకులు డ్రా చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
 మాఫీ కోసం చూస్తే ...నోటీసు ఇచ్చారు
 ప్రభుత్వం రైతులకు  రుణమాఫీ  చేస్తుందని ఎంతో ఆశగా  ఎదురుచూస్తున్నాం. తీరా అలమండ వికాస్‌గ్రామీణ  బ్యాంకు వారు రుణం తీర్చాలని నోటీసు పంపించారు. ముఖ్యమంత్రి  చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటనలు  చేస్తున్నారు. మరోవైపు రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసిచ్చింది. అలమండ గ్రామీణ వికాస్‌బ్యాంకులో పంటల కోసం 35 వేలు  రుణం  తీసుకున్నాను. పంటలపండక  తీవ్ర ఇబ్బందుల్లో  ఉన్నాం. ఈ పరిస్థితిలో వడ్డీతో కలిపి రూ.43 వేలు చెల్లించాలని నోటీసు వచ్చింది.
 - బోని జగన్నాథం, రైతు,శిరికిపాలెం, జామి మండలం
 
 నోటీసులిచ్చారు
 మాది సాయి పొదుపు సంఘం. సభ్యులందరం రుణం తీసుకున్నాం. రుణమాఫీ  చేస్తామని  ముఖ్యమంత్రి  చంద్రబాబు  ప్రకటించడంతో కట్టడం మానేశారు. తీరా బకాయి చెల్లించాలని బేంకోలు నోటీసు పంపించారు.   
 - దివ్వల పార్వతి, సాయి పొదుపు సంఘం,
 గొడికొమ్ము, జామి మండలం                                                     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement