నట్టేట ముంచారు
‘మమ్మల్ని నట్టేట ముంచారు. ఓట్లేసి గద్దె నెక్కించిన పాపానికి దారుణంగా మోసపోయాం. ఇప్పుడు మా పరిస్థితేంటి’ అంటూ ముఖ్యమంత్రి తీరుపై రైతులు ధ్వజమెత్తారు. టీడీపీని అధికారంలోకి తీసుకువస్తే రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఆరునెలల తర్వాత గురువారం రుణమాఫీపై స్పష్టత ఇచ్చారు. ఈనెల 10వ తేదీ నుంచి అర్హులైన వారి ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేస్తామని ప్రకటించారు. అయితే వాటికి కొన్ని ఆంక్షలు విధించడంపై రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.50 వేలలోపు వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని, మిగిలిన వారికి దశలవారీగా ఐదేళ్ల కాలంలో మాఫీ చేస్తామని చెప్పడంతో రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో సగం మంది రైతులకు కూడా మాఫీ వర్తించకపోవడంపై మండిపడుతున్నారు.
వడ్డీల భారం పెరిగింది
రైతులకు అసలుతో పాటు వడ్డీల భారం పెరిగింది. మొత్తం మాఫీ చేస్తామని చెప్పి ఇప్పడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అంటున్నారు. ఇది అన్యాయం. ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ప్రభుత్వానికి ఫీజు చెల్లించి నోటింగ్ (ఆస్థిని బ్యాంకు పేరున రిజిస్ట్రేషన్) చేయించాం. దీనికి రుణమాఫీ ఎలా వర్తింపజేస్తారు. నాలుగేళ్ల వరకు మాఫీ చేయకపోతే బ్యాంకులో ఉన్న ఆస్తులు బయటకు ఎలా వ స్తాయి.
- కాశింశెట్టి రాంబాబు, రైతు,
బంధపురం, దేవరపల్లి మండలం
తడిసిమోపెడయ్యాయి
ఎన్నికలలో చంద్రబాబు మాటలు నమ్మి ఘోరంగా మోసపోయా. ఏటా మార్చిలో రుణం చెల్లించి తిరిగి రుణం తీసుకునేవాడిని. ఈసారి పాతరుణం చెల్లించవద్దని టీడీపీ నాయకులు చెప్పడంతో చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది రుణం తీసుకోవడం కుదరకపోగా బయట అప్పు చేయాల్సి వచ్చింది. ఓ పక్క బ్యాంకు వడ్డీ, మరోపక్క బయట వడ్డీలు కలిసి తడిసిమోపెడయ్యాయి.
- చెల్లారి రామ శ్రీనివాస్, రైతు,
జగన్నాథపురం, నల్లజర్ల మండలం
నిబంధనలు దారుణం
రైతుల రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీ భారం పెరుగుతోంది. పూర్తి రుణమాఫీకి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలు రోజుకు ఒకటి చొప్పున చెబుతున్నారు. వ్యవసాయం చేయని రైతుల రుణాల మాఫీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. లక్షలాది మంది రైతులు వారి కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు.
-పి.నరేంద్ర, రైతు, మలకచర్ల,
దెందులూరు మండలం
కౌలు రుణాలపై దాటవేత
వ్యవసాయం పండుగ కాదు దండగన్న చంద్రబాబు మాటలను ప్రస్తుతం నిజం చేసేలా ఉన్నారు. పదేళ్లుగా రెండెకరాలను కౌలుకు చేస్తున్నా. ఇప్పటివరకు లాభం పొందింది లేదు. రుణమాఫీతో ఒకింత కష్టాలు తగ్గుతాయనుకున్నాను. ప్రభుత్వం కౌలు రైతుల రుణాలపై దాటవేత ధోరణి అవలంభించడంతో నష్టపోతున్నాం.
-చెల్లబోయిన వెంకటేశ్వరరావు,
కౌలు రైతు, రాయకుదురు.
ఒత్తిడి తెస్తున్నారు
బ్యాంకు, సొసైటీలో కలిపి సుమారు రూ.2 లక్షల అప్పు తీసుకున్నాను. చంద్రబాబు ఎన్నికల ముందు రుణాలు మాఫీ చేస్తామనడంతో అప్పుటు కట్టడం మానివేశాను. మొన్న సార్వా సాగుకు బయట అప్పు చేశాను. రుణం కోసం వెళితే పాత బకాయిలు కట్టమని బ్యాంకు వాళ్లు అంటున్నారు.
- రావుల శ్రీనివాస్, రైతు, మొగల్తూరు
రోజుకో మాట
రైతు రుణాలను మాఫీచేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రోజుకో మాట చెబుతూ మభ్యపెడుతున్నారు. రుణమాఫీపై తొలి సంతకం పెడతానని చెప్పి కోటయ్య కమిటీపై సంతకం పెట్టారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ పూర్తిగా చేయాలి
- సయ్యద్ బాజీ, రైతు, బుట్టాయగూడెం
రైతుమిత్రల ఊసేది
దర్భరేవు మ్యాక్ సొసైటీలో రూ.50 వేలు రుణం తీసుకున్నా. రైతుమిత్ర గ్రూపు ద్వారా 10 మంది కలిసి రూ.5 లక్షల రుణం తీసుకున్నాం. రుణమాఫీలో రైతుమిత్ర బకాయిల ఊసెత్తడం లేదు. మేమంతా అయోమయంలో ఉన్నాం. రుణం చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే అప్పుచేసి రూ. 50 వేలు చెల్లించా. మళ్లీ అప్పు పుట్టే దారిలేదు.
-కడలి రాంబాబు, సార్వ,
న రసాపురం మండలం
కాలయాపన తగదు
రోజుకో మాట చెప్పి రుణమాఫీపై కాలయాపన చేశారు. ఆలస్యం కావడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. గత్యంతరం లేక వడ్డీ వ్యాపారుల నుంచి రుణం తీసుకున్నాం. ఇప్పటికీ ఫేస్-1, ఫేస్-2 అంటూ రుణమాఫీ జాప్యం చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్లు బంగారం జప్తు చేస్తామని నోటీసులు ఇచ్చారు.
- కాటి దాసు, రైతు, బూరాయిగూడెం
కౌలు రైతులకు
న్యాయం చేయాలి
కౌలు రైతులు తీసుకున్న రైతు మిత్ర రుణాలను కూడా మాఫీ చేయాలి. కౌలు రైతు కుటుంబాలు బ్యాంకుల నుంచి తీసుకున్న బంగారు ఆభరణాల రుణాలను పూర్తిగా మాఫీ చేసి ఆదుకోవాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఉంది.
-గూటూరి సత్యనారాయణ,
కుముదవల్లి, పాలకోడేరు మండలం
పూర్తిగా మునిగిపోయాం
రుణమాఫీ అంటూ చంద్రబాబు మభ్యపెట్టడం వలన ఒక్కో కుటుంబం రూ.40 వేలు అధనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రజలను వంచించి మోసం చేశారు. ప్రతి రైతూ అదనంగా వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. ప్రకటిస్తున్న రుణమాఫీ కేవలం అదనపు వడ్డీలకు కూడా సరిపోదు.
-ఎన్.వేణు ప్రతాపరెడ్డి, రైతు, పెనుగొండ
వడ్డీ రూ.15 వేలు పెరిగింది
ప్రగడవరం ఆంధ్రా బ్యాంక్‌లో లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నాను. రుణమాఫీ ఆలస్యం కావడంతో వడ్డీ రూ.15 వేలు పెరిగినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు రూ. 50 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో చాలా మంది నష్టపోతున్నారు. రైతు రుణాలన్నీ ఒకేసారి రద్దు చేయాలి.
- గోలి నాగిరెడ్డి, రైతు, వెలగలపల్లి,
చింతలపూడి మండలం
ధాన్యం సొమ్ములు జమ చేసుకుంటున్నారు
రుణమాఫీ సంగతి దేవుడెరుగు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి వచ్చిన సొమ్ములను బ్యాంకర్లు అప్పుగా జమ చేసుకుంటున్నాయి. ఇది అన్యాయం. దీనిపై బ్యాంకర్లను అడిగితే మీకు రుణాలు చంద్రబాబు ఇచ్చారా.. బ్యాంకర్ల ఇచ్చారా అంటున్నారు.
-కంపరం నాగ నరసింహారావు,
వేగవరం, జంగారెడ్డిగూడెం మండ లం
అర్థం కావడం లేదు
నాకున్న అరెకరం పొలం తనఖా పెట్టి దర్భరేవు మ్యాక్ సొసైటీలో రూ.10 వేలు తీసుకున్నా. మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. రుణాలు చెల్లించనవసరం లేదని ఎలెక్షన్ల ముందు చెప్పారు. ఇప్పుడేమో కట్టమంటున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. రుణమాఫీకని ఆధార్, బ్యాంకు అకౌంట్ జెరాక్సులు తీసుకున్నారు.
-కండేటి నర్సింహారావు, తూర్పుతాళ్లు
సగమే అంటే ఎలా
రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు రైతులను పూర్తిగా నిస్సాయులను చేశారు. మా గ్రామంలో 29 మంది రైతులను జాబితా నుంచి తొలిగించారు. ఇప్పటికే బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. ఇప్పుడు సగం రుణం చెల్లిస్తామని ప్రభుత్వం అంటోంది. ఇలా అయితే ఎలా.
-గొర్రెల వెంకటరమణ, రైతు, మల్కాపురం
ఆశలను వమ్ముచేశారు
రైతు రుణమాఫీ అంశంపై జిల్లాలో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను ప్రభుత్వం అడియాశలు చేస్తూ పంట వేసుకునే సమయంలో పూర్తిస్థాయి రుణమాఫీ అమలుచేయకుండా దగా చేసింది. ఓ పక్క సొసైటీల్లో రుణాలు అందక పాత బకాయిలకు అప్పులు చేసి వడ్డీలు కట్టి తీర్చుకోవడం దురదృష్టకరం
- రాజనాల రామ్మోహనరావు,
కాంగ్రెస్ పీసీసీ సెక్రటరీ
వడపోతే లక్ష్యం
ఎన్నికల సమయంలో పూర్తి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు రూ.50 వేలే అంటున్నారు. ఈ రుణమాఫీ బ్యాంకులో చెల్లించాల్సిన వడ్డీకు కూడా సరిపోదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రూపు మాపేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలి.
-వైట్ల విద్యాధరరావు, సీపీఐ జిల్లా
రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
ఉద్యమిస్తాం
చంద్రబాబు పగటి వేషగాడిలా మారి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు 9 గంటల ఉచిత కరెంటు, పూర్తి రుణమాఫీ అని హామీలిచ్చి గద్దెనెక్కారు. ఇప్పుడు హామీలు గాలికొదిలేసి సింగపూర్‌లో గడుపుతున్నారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే రైతులందరితో కలిసి ఉద్యమిస్తాం.
- దొంత కృష్ణ, సీపీఐ జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
స్పష్టత లేదు
ఎన్నికలకు ముందు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక ఒక మాట అన్నట్టుగా ఉంది చంద్రబాబుతీరు. రుణమాఫీపై స్పష్టత, స్పష్టమైన అభిప్రాయం ముఖ్యమంత్రికి గాని మంత్రివర్గానికి కాని లేదు. అయోమయానికి గురిచేసే నిబంధనలు, విధానాలతో రైతులు నష్టపోతున్నారు.
- జమ్మి శ్రీనివాస్, రైతు
మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం