నేడు సచివాలయానికి బాబు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో పదేళ్ల అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సచివాలయాలు కలసి ఉన్న ప్రాంగణానికి రానున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు కార్యాలయం ‘సి’ బ్లాకులో ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఆ బ్లాకును తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ‘ఎల్’ బ్లాకులో ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల 8వ తేదీనే ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, సచివాలయంలో సీఎం కార్యాలయం సిద్ధం కాకపోవడంతో ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల వినతి మేరకు వారినుద్దేశించి ప్రసంగించడానికి గురువారం మధ్యాహ్నం సచివాలయానికి వస్తున్నారు.
ఉదయం 8.04 గంటలకు క్యాంపు ఆఫీస్‌కు బాబు
చంద్రబాబు గురువారం రాజ్‌భవన్ రోడ్డులోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సీమాంధ్ర సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్నారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 8.04 గంటలకు క్యాంపు కార్యాలయానికి వస్తారు. అక్కడి నుంచి 9 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకొని, ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం అనంతరం చంద్రబాబు ఉదయం 11.30 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు నివాళులర్పిస్తారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుంటారు.