అన్నగారే ఆదుకున్నారు...
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ఎన్.టి.రామారావుది ప్రత్యేక ముద్ర. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఎన్‌టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుకున్న ఈ ఘనతలేవీ తాజా బడ్జెట్ సమావేశాల్లో అధికార తెలుగుదేశం పార్టీని ఆదుకోలేదు. దివంగత అన్నగారే అధికారపక్షాన్ని ఆదుకున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి సభలో ప్రస్తావించిన ప్రతిసారీ.. ఎన్‌టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల పేరు చెప్పి అధికార పార్టీ నెట్టుకొచ్చింది.
* చంద్రబాబు హయాంలో దిష్టి చుక్కలు పెట్టినట్లు ఒక్కో వీధిలో ఒకటో, రెండో పక్కా ఇళ్లు ఇచ్చారని, వైఎస్ పార్టీలకు అతీతంగా పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేసి దేశంలోనే రికార్డు సృష్టించారని ప్రతి పక్షం విమర్శలు గుప్పించినప్పుడు.. పక్కా ఇళ్ల పథకానికి ఎన్‌టీఆర్ కొత్త అర్థం చెప్పారని, ఆ ఘనత టీడీపీదేనని అధికార పక్ష సభ్యులు ఘనంగా చెప్పుకున్నారు.
* డ్వాక్రా సంఘాల రుణాలు రద్దు చేయకుండా సంఘానికి రూ. లక్ష చొప్పున సరికొత్త పెట్టుబడి సమకూరుస్తామంటూ కొత్త రాగం ఎత్తుకున్న తీరును విపక్షం విమర్శించింది. మహిళా సాధికారత గురించి అధికారపక్షం మాట్లాడాల్సి వస్తే.. మళ్లీ అన్నగారే ఆదుకున్నారు.
*బీసీల అభ్యున్నతికి ఎంతో చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపిస్తే.. చర్చలో పాల్గొన్న టీడీపీ సభ్యులంతా బీసీలకు రాజకీయ అధికారం చేతికందడానికి ఎన్‌టీఆర్ కారణమని గట్టిగా వాదించారే తప్ప.. చంద్రబాబు నాటి 9 సంవత్సరాల్లో బీసీలకు చేసిందేమిటనే విషయం జోలికి వెళ్లలేదు.
* వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను వైఎస్ ఆదుకున్నారని విపక్షం ఘనంగా చెప్పినప్పుడు.. ఎన్‌టీఆర్ రూ. 50కే ఒక హార్స్‌పవర్ ఇచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసి తప్పించుకున్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపిన ఘనత చంద్రబాబుదేనని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఉద్యమించిన ప్రజలపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి ప్రజల రక్తం కళ్లజూసిన ముఖ్యమంత్రి.. అవన్నీ మరిచి విద్యుత్ రంగం శ్వేతపత్రాన్ని అసత్యాలు, అర్ధసత్యాలతో నింపేశారని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ తీరును తూర్పారబట్టినప్పుడూ.. మళ్లీ ఎన్‌టీఆర్ పేరునే టీడీపీ సభ్యులు స్మరించుకున్నారు. ఒక హార్స్‌పవర్ సామర్థ్యం ఉన్న పంప్‌సెట్‌కు నెలకు రూ. 50కే విద్యుత్ ఇచ్చి రైతులను ఎన్‌టీఆర్ ఆదుకున్నారని పదేపదే చెప్పారు. విద్యుత్ చార్జీల అంశం వచ్చినప్పుడు చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా అధికారపక్ష సభ్యులు జాగ్రత్తపడ్డారు.
* ఎన్‌టీఆర్ చేపట్టిన రూ. 2కే కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధాన్ని టీడీపీ తమ ఖాతాలో జమ వేసుకుం ది. ఎన్‌టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2కే కిలో బియ్యం పథకానికి, మద్య నిషేధానికి, రైతులకు రూ. 50కే ఒక హెచ్ పీ విద్యుత్ సరఫరాకు తూట్లు పొడిచింది చంద్రబాబే అని ప్రతిపక్షం దాడికి దిగినప్పుడు.. విపక్ష నేత మీద లేనిపోని ఆరోపణలతో ఎదురుదాడి చేసి బయటపడడానికి అధికార పక్షం శతవిధాలా ప్రయత్నించింది.
* శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన టీడీపీ సభ్యుల్లో దాదాపు అందరూ ఎన్‌టీఆర్‌ను ప్రస్తావించారు. కేవలం చంద్రబాబు 9 సంవత్సరాల పాలన గురించి మాత్రమే మాట్లాడి సరిపెట్టిన నేతలు దాదాపు లేరు. మొత్తం మీద.. చంద్రబాబుకు అధికారాన్ని అందుకోవడానికి ఉపయోగపడిన ఎన్.టి.రామారావే రెండు దశాబ్దాల తర్వాత కూడా అసెంబ్లీలో నెగ్గుకురావడానికీ అధికార పక్షానికి ఆసరాగా నిలవడం గమనార్హం.