మహాలక్ష్మి.. మహా మోసం..  | Chandrababu Naidu Mahalaxmi Scheme | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మి.. మహా మోసం.. 

Published Fri, Mar 15 2019 12:57 PM | Last Updated on Fri, Mar 15 2019 12:58 PM

Chandrababu Naidu Mahalaxmi Scheme - Sakshi

బంగారు తల్లులు (ఫైల్‌)

‘‘పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ. 30,000 బ్యాంకులో డిపాజిట్‌ చేసి యుక్త వయస్సు వచ్చే నాటికి రూ.రెండు లక్షలను అందజేస్తాం.’’

– 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలోని 16వ పేజీలో పొందుపర్చిన హామీ ఇది.

సాక్షి, మండపేట: బాలిక సంక్షేమానికి మహాలక్ష్మి పథకాన్ని తెస్తామన్న టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తక పోగా దివంగత వైఎస్‌ ఆశయానికి తూట్లు పొడిచింది. బాలిక సంరక్షణ కోసం వైఎస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన బంగారు తల్లి పథకానికి మంగళం పాడుతూ ఏకంగా ఆన్‌లైన్‌ నుంచి తొలగించేసింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం పేరిట దరఖాస్తులు స్వీకరణకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బంది వాపోతున్నారు.

 
బాలిక శిశు మరణాలు, బాల్య వివాహాలను అరికట్టి బాలికల ఉన్నత చదువులకు బాటలు వేసేందుకు 2005లో అప్పటి సీఎం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం (జీసీఐపీఎస్‌) ప్రవేశపెట్టారు. ఒక ఆడ పిల్లతో శస్త్రచికిత్స చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇరువురు ఆడపిల్లలతో శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున రెండు బాండ్లు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొన్ని మార్పులు, చేర్పులతో 2013 మే ఒకటో తేదీ నుంచి గత ప్రభుత్వం బంగారుతల్లి బాలికాభ్యుదయ సాధికార చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరి ఆడ పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ తదితర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో అర్హులైన వారిని ఎంపిక చేసేవారు.

పుట్టిన వెంటనే తొలి విడతగా రూ. 2,500, మొదటి రెండేళ్లు ఇమ్యూనైజేషన్, వైద్య సేవలు కోసం ఏడాదికి రూ.2,000 చొప్పున, 3, 4, 5 సంవత్సరాల్లో పౌష్టికాహారం నిమిత్తం ఏడాదికి రూ.1,500 చొప్పున, విద్యాభ్యాసం నిమిత్తం 1 నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ. 2,000 చొప్పున, 6, 7, 8 తరగతుల్లో ఏడాదికి రూ.2,500 చొప్పున బ్యాంకు ఖాతాకు జమచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ. 3,000 చొప్పున, ఇంటర్మీడియట్‌లో ఏడాదికి రూ.3,500లు చొప్పున, డిగ్రీలో ఏడాదికి రూ. 4,000లు చొప్పున చెల్లించడంతో పాటు డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్మీడియట్‌లోనే చదువు నిలుపుచేస్తే రూ.50,000లు జమచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొందరికి సాయం అందించింది.


ఆన్‌లైన్‌ నుంచి బంగారు తల్లి పథకం తొలగింపు 
2016 ఏప్రిల్‌ నుంచి బంగారు తల్లి పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. అప్పటికి జిల్లాలోని అర్బన్‌ ఏరియాల్లో 3,879 దరఖాస్తులు ఆన్‌లైన్‌ కాగా వీటిలో కేవలం 813 మందికి తొలి విడత సాయం అందింది. అలాగే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 24,909 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదుచేయగా కొద్దిమంది మాత్రమే సాయం అందించారు.

ఆన్‌లైన్‌ నిలిపివేయడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండానే ఈ పథకాన్ని మొత్తం ఆన్‌లైన్‌ నుంచి ప్రభుత్వం తొలగించడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మా ఇంటి మహాలక్ష్మి పేరిట గతంలో దరఖాస్తులు స్వీకరించినా తర్వాత వాటి విషయమై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులకు స్పష్టత ఇచ్చే అధికారులే కరువయ్యారు.

ఆన్‌లైన్‌ లేకపోవడంతో దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియడం లేదని సంబంధిత శాఖలకు చెందిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న మహాలక్ష్మి పథకం అమలుకు సంబంధించిన ఉత్తర్వులు ఏమీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు
నా భర్త తాపీమేస్త్రీగా పనిచేస్తుంటారు. ఇద్దరు ఆడపిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడుతున్నాం. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. అధికారులను అడుగుతుంటే ఆ పథకం అమలులో లేదని చెబుతున్నారు. 
– బొత్స నాగదేవి, ద్వారపూడి 
 
ఆ పథకం లేదంటున్నారు
ముందు ఆడపిల్ల కాగా 2014లో మరలా అమ్మాయి పుట్టింది. బంగారు తల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాం. బాండు కోసం ఎన్నో మార్లు అధికారులను అడిగితే త్వరలో వస్తుందని చెప్పారు తప్ప ఇప్పటికి రాలేదు. ఇప్పుడేమో ఆ పథకం లేదని చెబుతున్నారు. 
–  కె. రాజ్యలక్ష్మి, ద్రాక్షారామ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement