బీసీ బాలురకు ‘అపకారం’
మండపేట :వెనుకబడిన కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొంటున్న చంద్రబాబు సర్కారు క్రియలో బీసీ బాలురకు అపకారం తలపెట్టింది. బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌లో కోత పెట్టే క్రమంలో ఉపకారవేతనాలను బాలికలకే పరిమితం చేసింది. వారికీ అరకొరగానే నిధులు విడుదల చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆదాయ పరిమితిని మరింత తగ్గిస్తూ మెలిక పెట్టింది. సర్కారు వంచనపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 9, 10 తరగతులు చదివే (ప్రీ మెట్రిక్) బీసీ విద్యార్థులకు నెలకు రూ.100 చొప్పున విద్యాసంవత్సరంలో రూ. 1000 ఉపకార వేతనాలుగా ప్రభుత్వం అందజేస్తుంది. 2013-14 విద్యాసంవత్సరానికి ప్రీ మెట్రిక్ బీసీ విద్యార్థులు జిల్లాలో 21,023 మంది ఉన్నారు.
వీరిలో బాలురు 9,670 మంది ఉండగా బాలికలు 11,353 మంది ఉన్నారు. వీరికి ఉపకార వేతనాలుగా సుమారు రూ.2.10 కోట్లు విడుదల రావాల్సి ఉండగా కేవలం రూ.25 లక్షలు మాత్రమే ఇటీవల విడుదల చేసింది. ఈ నిధులను బాలికలకు మాత్రమే అందజేయాలని ఆదేశించినట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు అంటున్నాయి. గత విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌కు చేరుకోగా ప్రస్తుతం 10వ తరగతిలోకి వచ్చిన విద్యార్థుల్లో బాలికలు 6,196 మంది ఉన్నారు. వీరికి కూడా పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు కేవలం 2,500 మందికి మాత్రమే సరిపోతాయని అధికారులంటున్నారు. ప్రభుత్వం తీరుతో ఉపకార వేతనాలపై ఆశలుపెట్టుకుని చదువుకుంటున్న బీసీ బాలురు హతాశులవుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగిస్తున్న చదువులకు సర్కారు తీరుతో చరమగీతం పాడాల్సి వస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ధృవీకరణ పత్రాల కోసం ప్రదక్షిణలు
కాగా ఈ ఏడాది ఇచ్చే ఉపకార వేతనాల్లోనూ కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.44,600 లోపు వార్షికాదాయం ఉన్న వారే ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని మెలిక పెట్టింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.72 వేలు వార్షికాదాయం ఉన్న వారికి గత ప్రభుత్వం తెల్లకార్డులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆదాయ పరిమితి తగ్గించడంతో ఆ మేరకు ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఈ సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో చూపిన ఆదాయాన్ని తగ్గించి కొత్త ధృవీకరణ పత్రాల జారీకి కొందరు తహశీల్దార్లు విముఖత చూపుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం అనుచితం
ఉపకార వేతనాలను బాలికలకు మాత్రమే పరిమితం చేస్తే ఎందరో పేద విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరమవుతుంది. చదువు మాని పనిబాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తుంది. బీసీ సంక్షేమంపై ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి సర్కారు కట్టుబడాలి. బీసీ బాలబాలికలందరికీ ఉపకార వేతనాలిచ్చేందుకు నిధులు విడుదల చేయాలి.
- కోన సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మండపేట
ఆదాయ పరిమితి పెంచాలి
ఉపకార వేతనాలకు ఆదాయ పరిమితిని తగ్గించడం చాలా దారుణం. కొత్తగా ఆదాయం తగ్గించుకుని ధృవీకరణ పత్రాలు పొందేందుకు విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. విద్యార్థులు అందరికీ ఉపకార వేతనాలు విడుదల చేయడంతో పాటు బీసీ విద్యార్థులకు ఆదాయ పరిమితిని రెండు లక్షల వరకు పెంచాలి.
- బి.సిద్ధు, విద్యార్థి సంఘం నాయకుడు, రామచంద్రపురం