* సలహాదారులుగా మాజీ సీఎస్‌లు ఎస్‌వీ ప్రసాద్, మోహన్‌కందా, సీనియర్ ఐఏఎస్ రణదీప్ సుడాన్, రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం
* ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులుగా సతీష్ చంద్ర, గిరిధర్, దగ్గుబాటి సాంబశివరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, జి. సాయిప్రసాద్, ఐఎఫ్‌ఎస్ అధికారి రామలక్ష్మి పేర్ల పరిశీలన
* డీజీపీగా ప్రసాదరావును కొంత కాలం కొనసాగించాలని నిర్ణయం
* ఇంటెలిజెన్స్ ఐజీగా బాలసుబ్రహ్మణ్యం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చే నెల తొలి వారంలో బాధ్యతలు చేపట్టనున్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పేషీ అధికారుల నియామకం కోసం కసరత్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయమై గతంలో తన పేషీలో పనిచేసిన అధికారుల సహాయ, సహకారాలు, సూచనలు తీసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేషీలో ఓఎస్‌డీగా పనిచేసిన లక్ష్మీనారాయణ ఎంతో కాలంనుంచి ఆయన వద్దే పనిచేస్తున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కీలక బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య ప్రస్తుతం ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. వీరితోపాటు గతంలో తన వద్ద పనిచేసిన మాజీ ఐఏఎస్‌లు ఎస్‌వీ ప్రసాద్, ఎం. సాంబశివరావులతో పాటు పార్టీ నేతల సలహాలను కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు. తన పేషీలో ముఖ్య కార్యదర్శితోపాటు కార్యదర్శులు, ఓఎస్‌డీలుగా నియమించుకునేందుకు ప్రస్తుతం పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ అధికారి ఎ. గిరిధర్, గతంలో తన పేషీలో పనిచేసి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచే స్తున్న సతీష్ చంద్రల పేర్లను పరిశీలిస్తున్నారు. వారిద్దరితో చంద్రబాబు ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం.
సతీష్ చంద్ర డెప్యూటేషన్ ఈ ఏడాది జూలై 23కు ముగుస్తుంది. వీరే కాకుండా ప్రస్తుతం రాజ్‌భవన్‌లో గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఆర్థికశాఖలో ఉన్న దగ్గుబాటి సాంబశివరావు పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్‌ను తన పేషీలోకి తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. ఐఎఫ్‌ఎస్ అధికారి సీఎస్ రామలక్ష్మిని కూడా తన పేషీలో నియమించుకోవాలని ఆయన యోచిస్తున్నారు. వీరే కాకుండా ఇద్దరు ఐఏఎస్ అధికారులను చంద్రబాబు తన నివాసానికి పిలిపించుకుని పేషీలో నియమించుకునే విషయమై మాట్లాడారు. వారు ఆలోచించుకుని చెప్తామని అన్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు, ఐవీ సుబ్బారావుల్లో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. ఐవైఆర్ వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్నే సీఎస్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రిటైర్‌మెంట్ ఇప్పట్లో లేని అధికారిని నియమించుకోవాలనుకున్న పక్షంలో ఐవీ సుబ్బారావుకు ఛాన్స్ రావచ్చు.
సలహాదారులుగా వీరే....
ప్రభుత్వంలో అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు అనువుగా పలువురు సలహాదారులను నియమించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు మోహన్‌కందా, ఎస్‌వీ ప్రసాద్‌లతోపాటు గతంలో తన పేషీలో పనిచేసి ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఐఏఎస్ రణదీప్ సుడాన్, రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యంలకు సలహాదారులుగా అవకాశాలున్నాయి. చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పీఏగా రాజగోపాల్ నియమితులవుతారు.
డీజీపీగా కొనసాగనున్న ప్రసాదరావు
ప్రస్తుతం ఉమ్మడి రాష్ర్ట డీజీపీగా ఉన్న బయ్యారపు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తొలి డీజీపీగా కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారని సన్నిహితవర్గాల సమాచారం. ఇదిలా ఉండే ప్రభుత్వంలో కీలకమైన పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నియమించనున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్రలోని థానే జాయింట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న, గతంలో రాష్ట్రంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేసిన ఐజీ ర్యాంక్ అధికారి వీవీ లక్ష్మీనారాయణను తిరిగి రాష్ట్రానికి రప్పించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఆయన్ను రాష్ట్రానికి డెప్యూటేషన్‌పై రప్పించి శాంతి, భద్రతల విభాగంలో ఐజీగా నియమిస్తారని ఎన్‌టీఆర్ భవన్ వర్గాల సమాచారం.
సీపీఆర్‌వోగా ఏఏ రావు లేదా విజయకుమార్
చంద్రబాబు పేషీలో కీలకమైన ముఖ్య సమాచార పౌరసంబంధాల అధికారి (సీపీఆర్‌వో)గా దూరదర్శన్ కేంద్ర న్యూస్ డైరె క్టర్‌గా ఢిల్లీలో పనిచేస్తున్న ఐఐఎస్ అధికారి ఏ. అయ్యేశ్వరరావు (ఏఏ రావు) లేదా గతంలో సీపీఆర్‌వోగా పనిచేసిన డాక్టర్ ఎస్. విజయకుమార్‌లలో ఒకరు నియమితులయ్యే అవకాశం ఉంది. ఏఏ రావు 2009 సాధారణ ఎన్నికల సమయంలోనే ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి చంద్రబాబు దగ్గర పనిచేశారు. టీడీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన పలుమార్లు చంద్రబాబును కలిసి తన మనస్సులోని మాటను వెల్లడించారు. అయితే విజయకుమార్‌ను సీపీఆర్‌వోగా నియమించుకుంటే మంచిదని గతంలో పేషీలో పనిచేసిన పలువురు అధికారులు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం.
సీఎస్‌వోలుగా కొనసాగనున్న ముద్రగడ, నగేష్‌బాబు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ముఖ్య భద్రతాధికారు(సీఎస్‌వో)లుగా ప్రస్తుతం అదే హోదాలో పనిచేస్తున్న అదనపు సూపరింటెండెంట్ ముద్రగడ నాగేంద్రరావు, డీఎస్‌పీ నగేష్ బాబు కొనసాగనున్నారు. వీరిద్దరూ సుమారు 15 సంవత్సరాలుగా చంద్రబాబు వద్ద భద్రతా విధులు నిర్వరిస్తున్నారు.
పేషీ అధికారుల కోసం చంద్రబాబు కసరత్తు
Published Fri, May 23 2014 2:55 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement