చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. విజయవాడ లేదా గుంటూరులో!
జూన్ తొలి వారంలో ప్రమాణ స్వీకారం!
అంతకు ముందు తిరుపతిలో టీడీఎల్పీ భేటీ?
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ నెల తొలి వారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ నాలుగు లేదా తొమ్మిదిన ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని పార్టీ నేతల్లో కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గతంలో ‘యువగర్జన’ నిర్వహించిన ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపడితే బాగుం టుందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అలా కాని పక్షంలో గుంటూరు లేదా విజయవాడ నగరాల్లో ఏదైనా ఖాళీ స్థలాన్ని చూసి అక్కడ వేదికను ఏర్పాటు చే సి ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో పార్టీ ఆశించినన్ని సీట్లు సాధించలేదు. దీంతో ఆ ప్రాంతంలో కాకుండా ఎక్కువ సీట్లు సాధించిన మధ్య కోస్తా ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించింది. దీంతో అక్కడి నేతలు, కార్యకర్తల్లో జోష్ ఉంటుందని, ప్రమాణ స్వీకారానికి కూడా వారు ఉత్సాహంగా హాజరయ్యే అవకాశం ఉందని, దీని వల్ల ప్రజలకు మంచి సంకేతం పంపినట్లు ఉంటుందని నేతలు చెప్పటంతో బాబు అందుకు సరేనన్నట్లు సమాచారం.
తిరుపతిలో టీడీఎల్పీ భేటీ..: తిరుపతిలో పార్టీ పరంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మొదటి టీడీఎల్పీని అక్కడ నిర్వహించాలన్న యోచన పార్టీ నేతల్లో ఉంది. ఈ నెల 26న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళతారు. 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో పార్టీ మహానాడు జరుగుతుంది. తరువాత రోజు నేతలందరూ తిరుపతి వెళ్లి శాసనసభాపక్షాన్ని నిర్వహించాలంటే వీలు కాదు. కాబట్టి ఒకటి, రెండు రోజులు తర్వాత సమావేశాన్ని నిర్వహిస్తారని సమాచారం. కాని పక్షంలో హైదరాబాద్‌లోనే శాసనసభాపక్ష సమావేశాన్ని 29 లేదా 30 తేదీల్లో నిర్వహించి సభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం కూడా లేకపోలేదు.