క్యాంపు కార్యాలయంగా చంద్రబాబు నివాసం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఆధునాతన సౌకర్యాలతో విలాసవంతంగా నిర్మించిన ఈ భవనంలోకి చంద్రబాబు నాయుడు ఇటీవలే గృహప్రవేశం చేశారు. మే 31వ తేదీతో జీవో నెంబర్ 68 ద్వారా రహదారులు, భవనాల శాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చడంతో భవన నిర్వహణ భారమంతా ఇప్పుడు ప్రభుత్వంపై పడనుంది. భవనానికి ఏర్పాటు చేసిన భద్రాత ఏర్పాట్లకయ్యే ఖర్చులతో పాటు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికయ్యే అన్ని రకాల వ్యయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనుంది. ఇప్పటికే అప్పుల్లో, ఖర్చుల్లో ఉన్న ఏపీ సర్కారుకు తాజాగా మరింత భారమయ్యేలా భవనాల వ్యవహారం తయారయిందన్న విమర్శలున్నాయి.