రాజధానిలో రక్తికట్టని వీధి నాటకం | Chandrababu Naidu Tension In Amravati Tour | Sakshi
Sakshi News home page

రాజధానిలో రక్తికట్టని వీధి నాటకం

Published Fri, Nov 29 2019 3:39 AM | Last Updated on Fri, Nov 29 2019 11:37 AM

Chandrababu  Naidu Tension In Amravati Tour - Sakshi

సాక్షి, అమరావతి:‘అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’.. చంద్రబాబు గురించి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో చెప్పిన ఈ సామెత ఎంత పాపులరో చెప్పాల్సిన అవసరం లేదు. రాజధాని అమరావతిలో చంద్రబాబు గురువారం చేసిన పర్యటన ఆద్యంతం ఆ మాటల్ని గుర్తుచేసేలా సాగింది. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మించకుండా గ్రాఫిక్స్‌తో కాలం గడిపి.. ఇప్పుడు రాజధాని నిర్మాణం ఏమైందంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందంటూ పలువురు రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఇంకా ఆరునెలలు పూర్తికాని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని రాజధానిపై నిలదీయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తనకు అలవాటైన రీతిలో పెయిడ్‌ ఆర్టిస్టులు, అనుకూల మీడియా మధ్య అమరావతిలో పర్యటించిన చంద్రబాబుకు మిన్నంటిన రైతుల నిరసనలు స్వాగతం పలకడంతో ఆయన డ్రామా మొత్తం తేలిపోయింది.

ఈ పర్యటనలో రాజధాని నిర్మాణం కంటే గిమ్మిక్కులు, డ్రామాలకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పర్యటనలో రాజధాని ప్రాంతవాసులు కంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలు, టీడీపీ కార్యకర్తలే హంగామా చేశారు. పెయిడ్‌ ఆర్టిస్టులు మోహరించిన అనంతరం చంద్రబాబు ఇంటి నుంచి బయటకొచ్చారు. అనంతరం పర్యటన మొత్తం హైడ్రామాను తలపించింది. తన నివాసం పక్కన కూల్చివేసిన ప్రజావేదిక ప్రదేశం పరిశీలనతో పర్యటన ప్రారంభించడమే ఇందుకు ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసి దాదాపు ఐదు నెలలు గడిచింది. తన ఇంటి పక్కనే ఉన్న ఆ ప్రదేశాన్ని చూసేందుకు చంద్రబాబు ఇప్పుడు మందీమార్బలాన్ని వెంటబెట్టుకుని వెళ్లడం.. మీడియాలో ప్రచారం కోసమేనని అందరికీ అర్థమైంది.

చంద్రబాబు అసమర్ధతకు ఆ శిలా ఫలకాలే సాక్ష్యం
ఉద్ధండరాయునిపాలెంలో చంద్రబాబు తన డ్రామాను మరింత రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ముందు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం వద్ద ఉన్న శిలాఫలకాల్ని పరిశీలించారు. అక్కడికి సమీపంలో దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి తీసుకువచ్చిన మట్టి, నీళ్లు పోసిన స్థలం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. 2015లో ప్రధాని శంకుస్థాపన చేసినప్పటి నుంచీ... 2019లో చంద్రబాబు గద్దె దిగే వరకూ అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. ఒక్క నిర్మాణం కూడా టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఆ ప్రదేశాన్ని బాబు పరిశీలించలేదు. ఇప్పుడు ఎంతో ప్రేమ పుట్టికొచ్చినట్లు.. సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు. ఆత్మరక్షణలో పడినప్పుడు, తీవ్ర అసహనంతో ఉన్న  ప్రతిసారి చంద్రబాబు ఇలాంటి డ్రామాలే ఆడతారని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ముందు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పార్టీల్ని కూడగడతానని ఢిల్లీ వెళ్లి పార్లమెంటు మెట్లకు ఇదే రీతిలో నమస్కారం చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

రైతుల నిరసనతో బిత్తరపోయిన బాబు
అమరావతి పర్యటన పేరుతో రాజకీయంగా లబ్ధి పొందాలని చేసిన పన్నాగాన్ని రాజధాని రైతులు, రైతు కూలీలు తిప్పికొట్టడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. టీడీపీ నేతలున్న బస్సు సీడ్‌యాక్సెస్‌ రోడ్డులోకి ప్రవేశించగానే రైతులు, కూలీలు, దళితులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తమను మోసగించినందుకు క్షమాపణ చెప్పాకే కదలాలని పట్టుబట్టారు. ఈ పరిణామాలతో చంద్రబాబు బిత్తరపోయారు. తన డ్రామా తేలిపోయిందని అసంతృప్తి ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపించిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.

దాంతో ఆయన పార్టీ నేతలపై కూడా రుసరుసలాడారని సమాచారం.ముందు అనుకున్నట్టు కాకుండా పర్యటనను కుదించుకుని ఎక్కడా దిగకుండా తూతూ మంత్రంగా ముగించారు. రాయపూడిలోని నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల నివాస సముదాయాలు, నేలపాడులో అసెంబ్లీ భవనం, సచివాలయం, విభాగాధిపతుల భవనాల కోసం వేసిన పునాదుల్ని బస్సు నుంచే చూశారు. మందడంలో నిర్మాణంలోని పేదల గృహసముదాయాల వద్ద మీడియాతో మాట్లాడి మమ అనిపించారు.

రైతులపై దాడికి టీడీపీ కార్యకర్తల యత్నం
అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఫ్లెక్సీలు, జెండాలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల వైపు టీడీపీ కార్యకర్తలు దూసుకురావడంతో.. వెంకటపాలెం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రోప్‌ పార్టీ సాయంతో రైతులను అక్కడి నుంచి పంపించేశారు. చంద్రబాబు పర్యటనపై నిరసన తెలుపుతున్న రైతులు, కూలీలపై టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రైతుల సమీపానికి దూసుకొచ్చి మోటార్‌ బైక్‌లతో గట్టిగా హారన్‌ కొడుతూ.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. కొంతమంది ప్రభుత్వంపై దూషణలకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన కొందరు రైతులు తమ గోడు వినకుండా.. తమపై దూషణలకు దిగడంతో చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు విసిరి నిరసన వ్యక్తం చేశారు.

వెంకటపాలెంలో బాబు దిష్టిబొమ్మ దహనం
రైతులపై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తల చర్యలకు నిరసనగా రైతులు వెంకటపాలెం వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గో బ్యాక్‌ బాబు.. బాబు డౌన్‌ డౌన్‌! అంటూ నినాదాలు చేశారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో అలజడి రేపేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
 
5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించింది: చంద్రబాబు
మన అమరావతి, మన భవిష్యత్‌ కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే రాజధాని ప్రాంతంలో పర్యటించానని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. మందడం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆదాయం సృష్టించి.. రాష్ట్ర పేదరికాన్ని రూపుమాపే నగరంగా అమరావతికి రూపకల్పన చేశామన్నారు. ఆరునెలలుగా ఏ చేస్తున్నారో చెప్పమంటే దాడి చేస్తారా? అని అన్నారు. రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణలను ఆరు నెలల్లో ఎందుకు రుజువు చేయలేకపోయారని చంద్రబాబు ప్రశ్నించారు.

అమరావతిని ముంపు ప్రాంతం కాదని, 1853 వరదల్లో, 2009వరదల్లో ఎక్కడా ముంపు లేదని అన్నారు. అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉంటుందనే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని చెప్పారు. అద్భుత ఆలోచనతో ప్రారంభమైన అమరావతిని ఆదిలోనే చంపేశారని ఆయన ఆరోపించారు.  భూమి హక్కులు సీఆర్డీఏకే ఉండేలా 58:42 వాటాలతో అమరావతిని మోడల్‌ సిటీగా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని, అయితే దుష్ప్రచారం చేసి సింగపూర్‌ను తరిమేశారని విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement